- Advertisement -
ఒక్క నీ దేశమే ఎవర్ గ్రీన్లాండ్లా
శాశ్వతంగా ఉండాలంటే ఎలా?
ఆటవిక న్యాయం చెల్లదు గాక చెల్లదు
గ్రీన్ లాండ్ పచ్చగా ఉండాల్సిందే
ఐస్ లాండ్ చల్లగా బతకాల్సిందే
రెడ్ సీ తన సార్వజలత్వాన్ని
కాపాడుకోవటానికి
ప్రమాదసూచిక ఎగరేయాల్సిందే
డెడ్ సీ కూడా చచ్చినట్టు ఉండాల్సిందే
ఇంగ్లాండ్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, నాగాలాండ్,
నెదర్లాండ్స్ అండ్ అదర్లాండ్స్
అన్నీ యథాతథంగా ఉండాల్సిందే
కొన్నాళ్ళకు వెర్రెత్తిపోయిన వైట్ హౌస్
విశ్వం లోని బ్లాక్ హోల్స్ మీదా కన్నేస్తుందేమో!
అప్పుడు ఎర్రకోటతో సహా
అన్ని రాజ్యాలూ తప్పక కన్నెర్రజేస్తాయి సుమా!!
అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు
ప్రపంచ సంయుక్త దేశాల అమరిక కూడా
సుభిక్షంగా ఉన్నదున్నట్లుండాల్సిందే.
- నలిమెల భాస్కర్
- Advertisement -


