Monday, January 26, 2026
E-PAPER
Homeదర్వాజజంపన్నవాగులో తడిపిన పద్యం

జంపన్నవాగులో తడిపిన పద్యం

- Advertisement -

నర్సంపేటలో ఎర్రబస్సెక్కి
ఎన్నిసార్లు జాతరకు పోయిన్నో
కోడి కాళ్ళకు దారం చుట్టి
కవర్ల కట్టిపెట్టి
ఊపిరాడని ఆ బస్సుల్లో
నిలబడిపోయింది గుర్తే
కిటికీలపొంటి ఉరికి ఉరికి
సీటు కోసం దస్తీ వేసుకున్న వాళ్ళముఖంలో
ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలిచినంత
ఆనందం

కాళ్ళు చేతులు లాగుతూ
కడ్డీకి తలానించి నిలబడ్డోళ్ళకు
లోపలెన్నిమంటలు మండేదో
ఊరికే పంచాయతీల పొగను
కళ్ళల్లోకి ఊదేది
బస్సు సగం దూరం పోయినంక
చల్లని గాలి
పచ్చని చెట్లు జోలపాట పాడేవి
దారి మధ్యలో గట్టమ్మ తల్లి దగ్గర
పాలకాయగొట్టి విచ్చుకున్న
తెల్లనిపూలలాంటి కుడుకొక్కలను
రెండు దిక్కుల పెట్టి
నువ్వే దిక్కని మొక్కుదుము
కాళ్ళకు పని చెప్పకుండా
ట్రాఫిక్‌ జామ్‌ల పొదల్లో
చిక్కుకు పోనీయకుండా
బస్సు గుడి దగ్గరనే ఆగేది

జంపన్న వాగు దగ్గర
పాపాల తిత్తిని పరిశుభ్రంగా కడుక్కొని
పోరాటనేలకు
మనసుల గట్టి దండం పెట్టుకొని
వెన్ను చూపని ఆ తల్లుల వైపుగా
ఒక్కో అడుగు సాగేది
నెత్తిన బంగారం
తలో కొబ్బరికాయతో గుడికెళ్తుంటే
జై సమ్మక్క, సారలమ్మ అని
నినదిస్తూ వెళ్తున్న
శివసత్తుల వేపరిల్లల గాలి తాకుతుంటే
పార్వతమ్మలు అలంకరించుకున్న రంగులు మీద దూకి
ఎగిరి గంతులేస్తుంటే
పోటెత్తుతున్న సముద్రంలా
జాతరంతా భక్తి నురగలు కక్కేది

అమ్మలను దర్శించుకున్నంక
లోపలి బరువంతా దించుకొని
మళ్ళొచ్చే జాతరదాకా
మంచి చెడుల బాధ్యతను తల్లికప్పగించి
కానుకల ముల్లెను ఒప్పజెప్పేవాళ్ళం
జర్తిచ్చినమేకపోతును
భక్తితో బలిచ్చి నెత్తిమీది బాధనంత
చిందిపడ్డ రక్తపు చుక్కల్లాగే
భూమిలకు ఇంకియ్యమని
కోర్కెల ముడుపును చెట్టుకు కట్టి
మా బతుకు చక్రాన్ని
అమ్మల చేతికిచ్చేది

మధ్యాహ్నం కాకముందే
మంచి తావు చూసుకొని
మూడురాళ్ళు పొందిచ్చి
ఆకలిముల్లును తీసుకునేవాళ్ళం
ఇస్తారాకుల్ల ముద్దలు చేసి పెట్టి
తల్లికింత సుక్క ఆరబోసినంకనే
మాకు కళ్ళ సలువయ్యేది
ప్రకతి తల్లి ఒడిలో ఊయల కట్టుకొని
మనసునో చిన్నపిల్లాడిని చేసి
పాటలకు కాళ్ళను అరువిచ్చి
గాలిలో తేలిపోయేవాళ్ళం
పచ్చని చెట్ల నడుమ పందిరల్లుకుని
పూవులెక్క పూసిన నా మనసు
ఇక మేడారం జాతరను మరిచిపోతదా?
జాతరకు పోనియేడు
తప్పిపోయిన పిల్లాడిలెక్క
మనసంతా ఒకటే గుబులు

డా|| తండ హరీష్‌ గౌడ్‌, 8978439551

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -