Monday, January 26, 2026
E-PAPER
Homeఆటలుఅభిషేక్‌ తుఫాన్‌

అభిషేక్‌ తుఫాన్‌

- Advertisement -

ఛేదనలో మెరిసిన సూర్యకుమార్‌ యాదవ్‌
మూడో టీ20లో భారత్‌ ఘన విజయం
3-0తో టీ20 సిరీస్‌ టీమ్‌ ఇండియా సొంతం
14 బంతుల్లోనే అర్థ సెంచరీ

అభిషేక్‌ శర్మ (68 నాటౌట్‌) గువహటిలో తుఫాన్‌ సృష్టించాడు. 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 14 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. యువరాజ్‌ సింగ్‌ (12) తర్వాత వేగవంతమైన అర్థ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 154 పరుగుల ఛేదనలో అభిషేక్‌ శర్మతో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (57 నాటౌట్‌) రాణించటంతో 10 ఓవర్లలోనే కథ ముగించిన ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుని, చివరి 2 మ్యాచ్‌లను నామమాత్రం చేసింది. భారత్‌, న్యూజిలాండ్‌ నాల్గో టీ20 బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది.

నవతెలంగాణ-గువహటి
అభిషేక్‌ శర్మ (68 నాటౌట్‌, 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (57 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) గువహటిలో రెచ్చిపోయారు. అభిషేక్‌ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగగా.. అగ్నికి వాయువు తోడైనట్టు సూర్యకుమార్‌ సైతం ప్రతాపం చూపించాడు. అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ ఛేదనలో అజేయ అర్థ సెంచరీలతో కదం తొక్కగా.. 154 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 10 ఓవర్లలోనే ఊదేసింది. మరో 60 బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే నిష్క్రమించినా.. ఇషాన్‌ కిషన్‌ (28, 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి అభిషేక్‌ శర్మ ఊచకోత కొనసాగించాడు.

కిషన్‌ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో దంచికొట్టాడు. బౌలర్లపై వంద శాతం నియంత్రణతో అభిషేక్‌ శర్మ ప్రతి బంతిని బౌండరీ దాటించాడు. 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 14 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి రెండో వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐదు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 20 బంతుల్లోనే 68 పరుగులు సాధించిన అభిషేక్‌ శర్మ.. గువహటిలో కివీస్‌ బౌలర్లను ఉతికారేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలెట్టినా… వేగంగా జోరందుకున్నాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 25 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో అభిషేక్‌, సూర్యలకు ఇది రెండో అర్థ సెంచరీ కావటం విశేషం.

రాణించిన బుమ్రా, బిష్ణోయ్
టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే వరుస ఓవర్లలో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (1), రచిన్‌ రవీంద్ర (4) నిష్క్రమించగా న్యూజిలాండ్‌ కోలుకోలేదు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (48), మార్క్‌చాప్‌మన్‌ (32) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ భారత పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా (3/17), స్పిన్నర్‌ రవి బిష్ణోయ్ (2/18) సహా హార్దిక్‌ పాండ్య (2/23) మెరవటంతో న్యూజిలాండ్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదిన మార్క్‌చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌.. బౌలింగ్‌ మార్పుతో జోరు కొనసాగించటంలో విఫలమయ్యారు. డార్లీ మిచెల్‌ (14), కైల్‌ జెమీసన్‌ (3), మాట్‌ హెన్రీ (1) నిరాశపరిచారు. మిచెల్‌ శాంట్నర్‌ (27 నాటౌట్‌) మరోసారి బ్యాట్‌తో విలువైన పరుగులు జోడించాడు. 20 ఓవర్లలో 9 వికెట్లకు న్యూజిలాండ్‌ 153 పరుగులు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -