ఎర్రనల్లితో నల్లబారిన మిర్చి
ప్రకృతి వైపరీత్యాలతో అపార నష్టం
దిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మిర్చి సాగు రైతు కంట్లో కారం కొట్టింది. ప్రత్యేకమైన అలంపూర్, గద్వాల సమీప నడిగడ్డ భూముల్లో మిరప సాగు చేయగా.. ఎర్ర నల్లి, ఆకు ముడతతోపాటు బూడిద తెగులు పంటను దెబ్బతీశాయి. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిరప వేసిన రైతులు లాభాలు పొందగా.. ఈసారి కోటి ఆశలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా మిర్చి పంట సాగు చేశారు. అయితే, తెగుళ్ల బెడద.. అధిక వర్షాలు నష్టం చేశాయి. దీంతో దిగుబడి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల్లో లక్షా 25వేల ఎకరాల్లో సాగయింది. గద్వాల జిల్లాలో 2022లో మిర్చి పంట 52 వేల ఎకరాలలో సాగు చేయగా, 2023-24లో 65,115 ఎకరాలు, 2024-25లో 75,852 ఎకరాలు, 2026లో 85 వేల ఎకరాలకుపైగా సాగు చేశారు. తెగుళ్ల వల్ల ఇప్పటికే సగానికిపైగా మిర్చి పంటను తొలగించి మక్క, పెసర, వేరుశనగ వంటి పంటలను సాగు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాలలో మిర్చి పంటను సాగు చేశారు.
ఎర్రనల్లి తెగులు సోకి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో రైతులు మిర్చి స్థానంలో మక్క, వేరుశనగ పంటలను సాగు చేసుకుంటున్నారు. సాగు చేసిన రైతులకు పెట్టుబడి పోను ఏటా ఎకరాకు రూ.50 వేలపైనే ఆదాయం వచ్చేది. కానీ ఈసారి చేతికొచ్చిన మిర్చిని అమ్మితే కనీసం పెట్టిన పెట్టుబడికి సరిపోయే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోయారు. ఆకు ముడత పురుగు, కొమ్మకుళ్లు, జెమిని వైరస్, పచ్చ, తెల్లదోమ ఎర్రనల్లి సోకడంతో పైరు ఎదకపోవడంతోపాటు దిగుబడి రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఎకరాకు సుమారు 20 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 5 క్వింటాళ్లకు పడిపోయింది. 2022-2023లో గుంటూరు మిర్చి క్వింటా రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు, బాడీ రకం రూ.15 వేల నుంచి రూ.35 వేల ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి లేక పోవడం రైతులను వేధిస్తోంది. ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే.. 50 కేజీలు కూడా రావడం లేదంటున్నారు.
మిర్చి రైతులను ఆదుకోవాలి
ఈ ఏడాది మిర్చి రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి అయితే కనీసం పెట్టుబడి అయినా తీరడం లేదు. అప్పులు రైతు నెత్తిమీద కుంపటిగా మారాయి. ఒక్క ఏడాదిలో రెండు ఫ్రధాన పంటలలో నష్టం జరిగితే రైతులు పరిస్థితి అగమ్యగోచరం. ఈ పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
-చింతకాయల బాలరాజ్- గుంతకోడూరు, నాగర్‌కర్నూల్ జిల్లా
ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టాలి
రబీ పంటలతో రైతులు లాభం పొందాలి. మక్క, వరి, వేరుశనగ వంటి పంటలను సాగు చేయొచ్చు. నష్టం భారీగా ఉన్నా.. ఇన్సూరెన్స్ లేకుంటే పరిహారం రాదు. నల్లరేగడి వంటి పొలంలో తేమ అధికంగా ఉండటం వల్ల పంట నష్టం జరుగుతుంది. రైతులు అవగాహనతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిసారించాలి.
-పుట్టపాక వెంకటేశ్వర్లు- వ్యవసాయ అధికారి, నాగర్‌కర్నూల్ జిల్లా



