ఆర్థిక మంత్రిని కోరుతున్న ఎంఎస్‌ఎంఈలు
కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. చిన్న చిన్న వ్యాపార సంస్థలు రోజువారీగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి విధానపరమైన మద్దతు అందించాలని అవి కోరుతున్నాయి. రుణాలు సులభంగా లభించేలా చూడాలని, మెరుగైన బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ఎంఎస్‌ఎంఈల బలోపేతంపై దృష్టి సారించాలని సూచిస్తున్నాయి. పరిమితమైన ఆర్థిక వనరులతో వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న సంస్థలకు సులభంగా రుణం లభించేలా, తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం కల్పించేలా ఈ బడ్జెట్ చర్యలు తీసుకుంటుందని నిపుణులు ఆశిస్తున్నారు.
రుణ నిబంధనలు సరళతరం చేయండి
ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ సకాలంలో, తక్కువ వడ్డీకి రుణాలు పొందడంలో ఇబ్బంది పడుతున్నాయని ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) రంగంలోని ప్రముఖులు తెలిపారు. సంక్లిష్టంగా ఉన్న రుణ నిబంధనలు, రుణాల అందజేత ప్రక్రియలో జరుగుతున్న జాప్యం కారణంగా ఎంఎస్‌ఎంఈలు ఆశించిన మేర పురోగతి సాధించలేకపోతున్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలకు రుణాలు సులభంగా లభించాలని, బలమైన డిజిటల్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, ఈ అంశాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వాలని పల్స్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ చిరాగ్ షా కోరారు. ‘రాబోయే బడ్జెట్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం.
ఎంఎస్‌ఎంఈలకు సులభంగా రుణాలు లభించాలి. వేగవంతమైన, పారదర్శకమైన డిజిటల్ సదుపాయాల కల్పన ద్వారా ఆ సంస్థలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కోరుతున్నాం’ అని అన్నారు. నిబంధనలను సరళతరం చేయడం, రుణ గ్యారంటీ పథకాలను విస్తరించడం ద్వారా చిన్న వ్యాపారాలకు కొత్తగా వృద్ధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆర్థిక సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే రుణదాతలు సకాలంలో ఎంఎస్‌ఎంఈలకు అప్పులు ఇస్తారని తెలిపారు. బాధ్యతాయుతమైన డేటా వినియోగ ప్రాధాన్యతను కూడా షా నొక్కి చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (డీపీడీపీఏ) కింద డేటా భద్రతను నిర్ధారించేటప్పుడు ఫిన్‌టెక్ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వాలని, విశ్వసనీయ, సమగ్ర రుణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
బీమాకు పన్ను ప్రయోజనాలు కల్పించండి
వ్యాపారానికి అవసరమైన అత్యవసర ఆర్థిక సౌకర్యాన్ని కల్పించడంలో బీమా కీలక పాత్ర పోషిస్తుందని ఇన్సూరెన్స్ నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాపార బీమాను ప్రోత్సహించడానికి ఎంఎస్‌ఎంఈలకు పన్ను ప్రయోజనాలు కల్పించాలని బీమాకవచ్ వ్యవస్థాపకుడు, సీఈఓ తేజస్ జైన్ సూచించారు. అనేక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ చిన్న చిన్న వ్యాపార సంస్థలు బీమా సౌకర్యాన్ని పొందలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. సైబర్ మోసాలు, ఏఐ కారణంగా ఎదురవుతున్న నిర్వహణా వైఫల్యాలు వంటి కొత్త ప్రమాదాలు పొంచి ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ మోసాల నుంచి ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు విధానపరమైన మద్దతు అత్యవసరమని చెప్పారు. గ్రామీణ వ్యాపారాలు, మహిళలు నడుపుతున్న సంస్థలకు బీమా సౌకర్యాన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు.
జీఎస్టీ భారాన్ని తగ్గించండి
ఎంఎస్‌ఎంఈలు చెల్లించే ఉద్యోగుల బీమా ప్రీమియంలపై జీఎస్టీని కొంత మేర తగ్గించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ నిబంధనలు చిన్న వ్యాపారులపై ఆర్థిక భారం మోపుతున్నాయని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈలు గ్రూప్ ఇన్సూరెన్స్, లైఫ్ కవర్‌పై ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అయితే ఈ పాలసీలకు చెల్లించిన జీఎస్టీపై ఎంఎస్‌ఎంఈలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేయలేవు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోంది. బీమా ప్రీమియంల విషయంలో పాక్షిక ఊరట కల్పిస్తే ఎంఎస్‌ఎంఈలు దీర్ఘకాల ప్రయోజనాలు పొందుతాయి. మెరుగైన బీమా కవరేజీ కల్పిస్తే ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడడాన్ని చాలా వరకూ నివారించవచ్చు.



