Monday, January 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్యాయత్నం

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

చెరువు సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్న అజయ్
– ​తండ్రికి ఫోన్ చేసి సమాచారం.. ఎంజీఎంకు తరలింపు
నవతెలంగాణ – పరకాల: తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ యువకుడు చెరువు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న విషాద ఘటన శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన కుక్కల రమేష్ కుమారుడు అజయ్ (22) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని తల్లి ఆదివారం మందలించింది. తల్లి మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్, ఆవేశంలో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. గ్రామానికి సమీపంలోని చెరువు వద్దకు చేరుకున్న అతను, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు.

ఆత్మహత్యకు పాల్పడే ముందు అజయ్ తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిసింది. ఆ వెంటనే ఒంటికి నిప్పుంటించుకోవడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. చెరువు సమీపంలో మంటలు గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే అజయ్ శరీరం తీవ్రంగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బాధితుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు 108 ఈఎంటీ ఓరుగంటి భాస్కర్, పైలట్ పుట్ట విజయ భాస్కర్లు తెలిపారు. ప్రస్తుతం అజయ్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, పోలీసులు విచారణ జరుపుతున్నారని గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -