బీఆర్ఎస్ పనులకు రంగులు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ – పరకాల
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, పరకాల నియోజకవర్గంలో నయాపైసా అభివృద్ధి జరగలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పరకాల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన మొత్తం అసత్య ప్రచారాలు, మోసాల పునాదుల మీద నడుస్తోందని విమర్శించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులకు రంగులు వేసి, తామే చేసినట్లుగా మళ్లీ ప్రారంభోత్సవాలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. “మా హయాంలో వేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి, కొత్తవి పెట్టి శంకుస్థాపనలు చేయడం తప్ప, రెండేళ్లలో కొత్తగా మంజూరైన పనులు ఒక్కటైనా ఉన్నాయా?” అని ఆయన ప్రశ్నించారు. వంద పడకల ఆసుపత్రి, దామెర చెరువు మినీ ట్యాంక్ బండ్, వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ వంటి పనులు ఎందుకు ఆగిపోయాయో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ పాలనలో పుష్కలంగా లభించిన యూరియాకు ఇప్పుడు కొరత ఎందుకు ఏర్పడిందో ప్రజలు ఆలోచించాలని కోరారు.
కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ఉన్న పెన్షన్లు, రైతుబంధు నిధులను ఎగ్గొట్టి లబ్ధిదారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మేడారం జాతర పనులు కూడా నేటికీ పూర్తి కాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అంటేనే ‘స్కాములు, పర్సంటేజీల ప్రభుత్వం’ అని విమర్శించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు పరిపాలనపై పట్టు లేదన్నారు. ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



