తెలంగాణ పల్లె పల్లెలో జాతరలు మొదలవుతున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగిదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా ఈ జాతర చరిత్రకెక్కింది. కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు. ”దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర”గా గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది.
మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలకొద్దీ సందర్శకులు తండోపతండాలుగా తరలివస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతర సర్పజాతిని పూజించడమే దీని ప్రత్యేకత. పుష్యమాసము అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కెస్లాపూర్ గ్రామంలో ఉంది.
ఇక్కడ జరిగే ఈజాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. గ్రామ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లు తుందని, రోగాలు మటు మాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకుని గోదావరి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుం పూరైంది.
ఆ తర్వాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో, సంప్రదాయం కావాలో తేల్చుకో అనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తర్వాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి గోదావరిలో సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తర్వాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (భేటి కోరియాక్) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు.
అదే కెస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగోబా దేవాలయాన్ని నిర్మించారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో కోడి పందేలు, జూదం, పేకాట, అశ్లీల నృత్యాలు హోరెత్తించే పందెం రాయుళ్లకు, బెట్టింగ్ బంగారాజులకు, అల్ట్రా కల్చర్‌గా భిన్నంగా జాతరలు నిర్వహించుకోవడం తెలంగాణ సంస్కృతి వైభవాన్ని పెద్దఎత్తున ప్రపంచానికి చాటుతోంది.
డా. వెన్నెల గద్దర్



