Tuesday, January 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆధునికత-పేదరికం

ఆధునికత-పేదరికం

- Advertisement -

పెట్టుబడిదారీ సమాజంలో నిరంతరాయంగా కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతూనే వుంటారు. ప్రధానంగా మధ్యతరగతికి చెందిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియ సాగుతుంది. కొత్త ఉత్పత్తుల వినియోగానికి ఈ తరగతి ప్రజల్లో అత్యధికులు క్రమంగా అలవాటు పడ్డాక పాత నమూనాల ఉత్పత్తులను తయారు చేయడం తగ్గించివేస్తారు. అప్పుడు మొత్తం జనాభా అంతా కొత్తగా ప్రవేశపెట్టిన సరుకులకే అలవాటు పడవలసివస్తుంది. ఐతే ఆర్థికవేత్తలు మాత్రం వినియోగదారులకు పాత-కొత్త నమూనాల మధ్య ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నట్టు,వారిలో అత్యధికులు కొత్త నమూనాలను ఎంచుకుంటున్నారు గనుక దానిని బట్టి పేదరికం తగ్గిపోతూన్నట్టు చిత్రించడానికి పూనుకుంటారు. ఇక్కడ ప్రధాన అంశం సామాన్య ప్రజలు కొత్త నమూనాలను వాడుతున్నారా, లేక పాతవాటినా అన్నది కాదు. ఈ కొత్త నమూనాలను కొనుగోలు చేయడం కోసం వారివద్ద తగినంత ధనం ఉందా, లేక తమ ఇతర నిత్యావసరాలను కుదించుకుంటే తప్ప ఈ కొత్త నమూనాలను వారు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందా అన్నది ప్రధానం.

కొన్ని సందర్భాల్లో, శాస్త్ర, సాంకేతిక పురోగమనం ఫలితంగా ప్రజల జీవనస్థాయి మెరుగుపడే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా వైద్యరంగంలో మనం దీనిని చూడవచ్చు. ఇంగ్లాండ్‌ రాజు 8వ హెన్రీ కాలికి అల్సర్‌ ఏర్పడి అది నయం కానందువలన మరణించాడు. అప్పటికి యాంటీ బయాటిక్స్‌ ఇంకా కనుగొనలేదు. ఒకవేళ కనుగొనివుంటే ఆ రాజు మరికొంత కాలం బతికివుండేవాడు. అదే ఇప్పటికాలంలో ఒక పేదవాడికి అదే అల్సర్‌ వస్తే యాంటీ బయాటిక్స్‌ వాడి దానిని నయం చేసుకోగలుగుతాడు. దానిని బట్టి ఈ పేదవాడు ఇంగ్లాండ్‌ రాజు కన్నా ఆర్థికంగా మెరుగైన స్థాయిలో ఉన్నాడని చెప్పగలమా? యాంటీ బయాటిక్స్‌ కనుగొన్న కారణంగా యావత్తు ప్రజానీకం ఆరోగ్యస్థాయిని మెరుగుపరచుకోగలిగింది. అంతేతప్ప పేదరికం నుంచి బయట పడిపోయిందని నిర్ధారించలేము. కాబట్టి పేదరికాన్ని నిర్వచించడానికి మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన సరుకుల వినియోగం చేయగలగడం అనేది ప్రాతిపదిక అవదు. మరోలా చెప్పాలంటే ‘ఆధునికత’ వేరు, ‘పేదరికం’ వేరు. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన సరుకులను పొందడానికి ఆ కుటుంబం తనకు అత్యవసరమైన ఇతర సరుకుల వినియోగాన్ని తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబం పేదరికం నుంచి బయట పడినట్టు అవదు.

కేవలం ఆధునిక సరుకుల వినియోగం బట్టి పేదరికం తగ్గిపోయిందని చెప్పడం సరైంది కాదు. ఐరాస అభివృద్ధి ప్రాజెక్టు (యుఎన్‌డిపి), పేదరికాన్ని, మానవాభివృద్ధిని అధ్యయనం చేసే ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ (ఒపిహెచ్‌ఐ) కలిసి పేదరికాన్ని నిర్ధారించే ఒక కొత్త, ప్రాతిపదికను రూపొందించాయి. అదే మల్టీ డైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌. ఒక వ్యక్తి పేదవాడు అవునా కాదా అన్నది నిర్ధారించడానికి ఈ కొత్త పేదరిక సూచీ పది వేరు వేరు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. అవి: స్కూలు చదువు ఎన్ని సంవత్సరాలపాటు సాగింది, శిశు మరణ రేటు, విద్యుత్తు సౌకర్యం, తాగునీరు, తాటాకుల పైకప్పు కాకుండా వేరే పైకప్పు ఉన్న ఇల్లు , వంటగ్యాస్‌ వంటివి పొంద గలుగుతున్నారా, బాడీ-మాస్‌ ఇండెక్స్‌, బిఎంఐ ( అంటే ఒకానొక ఎత్తు, ఒకానొక వయస్సు ఉన్న వ్యక్తి ఎంతు బరువు కలిగివుండాలి అన్నది తెలియజేస్తుంది), ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం (అంటే బ్యాంక్‌ అకౌంట్‌ ఉందా అన్నది) వంటి ప్రాతిపదికలను ఎంచుకున్నారు. ప్రతీ అంశానికీ కొంత వెయిటేజి ఇచ్చారు. వాటిని బట్టి ఆ వ్యక్తి పేదవాడా కాదా అన్నది నిర్ధారిస్తారు.

అయితే, ఈ సూచీ ఆ వ్యక్తి ఆదాయాన్ని కాని, అతడి వినియోగాన్ని కాని ప్రాతిపదికగా తీసుకోలేదు. ఈ కొలబద్దలను బట్టి పేదరికాన్ని నిర్ణయించగలమా? ఉదాహరణకి, ఒక వ్యక్తికి బ్యాంక్‌ అకౌంట్‌ ఉంది కాని అందులో బాలెన్సు లేదనుకోండి. అప్పుడు అతడు పేదవాడు అవుతాడా? కాడా? అతడు నివసించే ఇంటి పైకప్పు తాటాకులు కాకుండా టిన్ను రేకులతో ఉందనుకోండి. అప్పుడు అతడి పేదరికం పోయినట్టేనా? అతడి బిడ్డలు స్కూలుకి ఎక్కువ కాలమే పోయినప్పటికీ, ఆ స్కూలు సక్రమంగా నడవలేదనుకోండి, లేదా, ప్రభుత్వం టీచర్‌ను నియమించలేదనుకోండి. అప్పుడు అతడి బిడ్డలకి నాణ్యత కలిగిన చదువు లభించినట్టు భావించాలా? అతడు పుట్టుకతోటే పెద్దగా ఎత్తుగా లేడనుకోండి. అప్పుడు అతడి బరువు సూచీ ఉండవలసిన స్థాయిలోనే ఉందని ఎలా నిర్ధారిస్తారు? అందుచేత పైన పేర్కొన్న ప్రాతిపదికలను బట్టి యాంత్రికంగా ఆ వ్యక్తి పేదవాడా కాడా అన్నది నిర్ధారించడం సరైంది కాదు.

ఇక రెండవ అంశం: ఆధునిక నమూనాల సరుకులను వాడడాన్ని బట్టి పేదరికం నుండి బైట పడ్డాడని నిర్ధారించడం కూడా సరైనది కాదు. ఆ సరుకును కొనుగోలు చేయడం కోసం అతడు తనకు అత్యవరసరమైన ఇతర సరుకులను వాడడం మానివేయవలసివచ్చిందా? అన్నది చూడాలి. ఉదాహరణకు: పౌష్టికాహారాన్ని పొందడానికి కావలసిన ఆహార వస్తువుల కొనుగోలు అతడు తగ్గించుకున్నాడా? అన్నది చూడాలి. ఇక్కడ పౌష్టికాహారం అన్నది మాత్రమే చూస్తే సరిపోతుందని నేననడం లేదు. కాని, ఒక వ్యక్తి పేదవాడా కాడా అన్నది తేల్చడానికి పౌష్టికాహార లభ్యత అన్నది తప్పకుండా ఒక కీలకమైన ప్రాతిపదికగా ఉంటుంది. ఇది మరీ ముఖ్యంగా వెనుకబడ్డ, అభివృద్ధి చెందుతున్న దేశాల విషయంలో కీలకం. అందుకే మన ప్రణాళికా సంఘం పౌష్టికాహార ప్రాతిపదికకు ప్రాధాన్యతనిచ్చింది. కనీస స్థాయిలో ఎన్ని కేలరీలశక్తిని పొందగలగాలి అన్నది నిర్ధారించింది.

మల్టీ డైమన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ వ్యక్తి ఎంత ఆదాయాన్ని పొందుతున్నాడు అన్నది పరిగణనలోకి తీసుకోకుండా తప్పు చేసింది. ఇక ప్రపంచబ్యాంక్‌ కేవలం ఒక కుటుంబం ఎంత వ్యయం చేస్తోంది అన్నది మాత్రమే పరిగణనలోకి తీసుకుని తప్పు చేస్తోంది. అక్కడ ప్రాతిపదికగా తీసుకుంటున్న ధరల సూచీ మాత్రం తప్పులతడకగా రూపొందించుతున్నది. బేస్‌ ఇయర్‌ గా ఒక సంవత్సరాన్ని ఎంచుకుని (1990 లేదా 2000 – ఇలా) ఇక అక్కడినుంచీ పెరుగుతున్న ధరల ప్రాతిపదికన దానిని సవరిస్తూపోతారు. ఇందులో ఒక ప్రధాన లోపం ఉంది. బేస్‌ ఇయర్‌ తర్వాత కాలంలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు: 1990 తర్వాత విద్య, వైద్యం ప్రయివేటుపరం అయిపోయాయి. 1990లో ప్రమాణాన్ని నిర్ణయించినప్పుడు ప్రయివేటు పరం కాలేదు. అప్పుడు చదువుకయే ఖర్చు లేదా వైద్యానికయే ఖర్చు చాలా పరిమితంగా ఉండేది. ఇప్పుడు వాటి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. కాని ప్రపంచబ్యాంక్‌ పేదరికాన్ని నిర్ణయించే విధానం ఈ మార్పును పట్టించుకోదు. అందువలన వాస్తవ పేదరిక స్థాయి కన్నా తక్కువగా ఉన్నట్టు నిర్ధారణకు అది దారి తీస్తుంది.

యుఎన్‌డిపి తీసుకున్న మొదటి విధానం కుటుంబ ఖర్చును అసలు పరిగణనలోకి తీసుకోనే తీసుకోదు. ఇక ప్రపంచబ్యాంక్‌ కేవలం కుటుంబ వ్యయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. కాని మొత్తం మీద రెండు పద్ధతులూ పేదరికాన్ని చాలా తక్కువ చేసి చూపుతాయి. అందుకే ఇప్పుడు మనం ఒక అర్ధం పర్ధం లేని పరిస్థితిని చూస్తున్నాం. ఒకపక్క ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం ఆకలిగొన్న జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ముందుంది. మనది ఇప్పుడు 115 దేశాలకు గాను వందవ స్థానం కన్నా ఎక్కువగానే ఉంది. మరోపక్క మన దేశంలో పేదరికం దాదాపు అదృశ్యం అయిపోయినట్టు లెక్కలు ప్రకటిస్తున్నాయి ! పేదరికం స్థాయి కన్నా దిగువన ఉన్నవారు ఆ లెక్కల ప్రకారం రెండు శాతం కన్నా తక్కువగానే ఉన్నారు. కాని ప్రజానీకంలో అత్యధికశాతం నెలనెలా వచ్చే ఐదుకిలోల ఉచిత బియ్యం కోసం ఎదురుచూస్తూనే వున్నారు! గతంలో సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్న కాలంలో అక్కడ పేదరికం పూర్తిగా నిర్మూలించబడింది. దాని వలన ఇంటింటికీ ప్రభుత్వం సరఫరా చేసే ఆహారధాన్యాన్ని ఆ ప్రజలు పూర్తిగా వినియోగించవలసిన పరిస్థితి లేక అది వృధా అయేది. దానికి ఇప్పుడు ఇండియా పూర్తి భిన్నంగా ఉంది.

ఇక్కడ ప్రభుత్వం సరఫరా చేసే ఆ ఉచిత బియ్యమే కోట్లాది ప్రజల జీవనాధారం అయిపోయింది. ప్రణాళికాసంఘం గతంలో నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం పట్టణాల్లో రోజుకి 2100 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని, గ్రామాల్లో 2200 కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రతీవ్యక్తీ పొందగలిగి వుండాలి. అలా పొందలేకుంటే ఆ వ్యక్తి పేదరిక స్థాయికి దిగువన ఉన్నట్టే. 1993-94 నుంచి 2017-18 మధ్య కాలంలో , అంటే నయా ఉదారవాద సంస్కరణలు అమలు జరగడం మొదలైన తర్వాత, జాతీయ శాంపిల్‌ సర్వే వెల్లడించిన గణాంకాలు పేదరికం ఎంతగా పెరిగిపోయిందని చెప్పాయంటే ఆ గణాంకాలను బయట పెట్టడానికి మోడీ ప్రభుత్వం సిద్ధం కాలేదు. వాటిని తొక్కిపెట్టింది. అంతే కాక, ఆ తర్వాత కాలంలో శాంపిల్‌ సర్వే కు ఉపయోగించే పద్ధతినే మార్చి వేసింది. ఇలా ప్రభుత్వం పేదరికాన్ని వాస్తవంగా తగ్గించడానికి పూనుకునే బదులు, వాస్తవంగా ఉన్న పేదరికాన్ని తొక్కిపెట్టి నాటకం ఆడుతోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతి నాణ్యమైన గణాంక విధానాన్ని అనుసరించే దేశంగా మనకి పేరుండేది. కాని ఇప్పుడు చివరికి ఐఎంఎప్‌ కూడా భారత గణాంక వివరాలను నమ్మదగ్గవిగా లేవని ప్రకటించింది!
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -