Tuesday, January 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసమర నినాదం

సమర నినాదం

- Advertisement -

మతతత్వంపై మహిళల అణచివేతలపై మరింత చేతనమై యుద్ధం చేస్తామని, సమానత్వం కోసం, హక్కుల కోసం సమరం కొనసాగిస్తామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) గొంతెత్తి నినదించింది. సమాజంలో, కుటుంబంలో, ఆర్థిక వ్యవస్థలో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నప్పటికీ…శ్రమకు తగ్గ గుర్తింపు, హక్కులు వారికింకా దూరంగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పోరాటం చేయడం ద్వారానే సమానత్వం సాధించగలమని బలంగా నమ్మిన ‘ఐద్వా’ జాతీయ మహాసభలు హైదరాబాద్‌ నగరంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. సామ్రాజ్యవాదంపై, మనువాదంపై పోరాడుతూ స్త్రీ సమానత్వం సాధించడమే తమ లక్ష్యంగా ప్రకటించిన ‘ఐద్వా’ మహాసభలలో దానికి అనుగుణంగా తీర్మానాలు చేసి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించనున్నారు. మనదేశంలో అప్రకటిత రాజ్యాంగంగా చెలామణి అవుతున్న మనుస్మృతి బోధించిన పురుషాధిక్య భావజాలం, స్త్రీని బానిసగా చూసే మనస్తత్వం మహిళను ఇలాగే ఉండాలంటుంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో స్త్రీలను ఆంక్షలకు, లింగ వివక్షతకు గురిచేస్తోంది.

అందుకే దేశంలో స్త్రీల ఆశలకు, ఆకాంక్షలకు, వారి హక్కుల సాధనకు ఐద్వా ఒక వేదికయింది. స్త్రీల సమస్యలను ఒక రాజకీయ ఎజెండాలోకి తీసుకువచ్చేందుకు, అన్ని సంఘాలను ఐక్యం చేసి ఉద్యమించడానికి చాలా గట్టి ప్రయత్నం చేసింది…చేస్తోంది. సంస్కృతి పేరుతోనే కాదు… కులం-మతం పేరిట దాడులు, లైంగిక హింస పెరుగుతున్న వేళ, మహిళలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, చట్టాలు నేరస్తులకు కొమ్ముకాయడం, మహిళల ఉపాధికి గండికొట్టడం వంటి వాటిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీని లైంగికవస్తువుగా, ద్వితియశ్రేణి పౌరులుగా చూసినంత కాలం ఈ హింస తగ్గదు. మహిళలలో భక్తి, ఆచారాల పేరుతో అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తూ పాలకులు వాళ్లను పావులుగా వాడుకుంటున్నారని దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని ‘ఐద్వా’ నొక్కిచెప్పింది. మహిళాభివృద్ధి, సమానత్వం, సాధికారత అని పాలకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనాన్ని ఖుల్లం ఖుల్లా ఎండగట్టింది. ఈ నేపథ్యంలో ‘ఐద్వా’ మతతత్వానికి వ్యతరేకంగా తీర్మానం చేసింది.

”దేశంలో మహిళల అభివృద్ధి, సాధికారతకు తమ ప్రభుత్వం పదకొండేండ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి మోడీ మాటలంతా జుమ్లానే అని ఐద్వా మహసభలలో పాల్గొన్న నలుగురు వీరవనితలు కుండబద్దలు కొట్టి మరి చెప్పారు. స్వచ్ఛ భారత్‌, జన్‌ థన్‌ యోజన, నారీ శక్తి, బేటీ బచావో – బేటీ పఢావో…లాంటి నినాదాలు మన ఆడపడుచుల గౌరవం పెంచాయంటూ… తనకు తానే జబ్బలు చరుచుకొని తెగ పొంగిపోతున్న ప్రధాని గుండెలదిరెలా ‘బీజేపీకో భగావో..దేశ్‌కో బచావో’ అంటూ మహిళలు సింహనాదం చేశారు. ‘నిత్యం లైంగిక దాడులతో చిల్లులు పడిన దేహంతో ‘భారతమ్మ’ చేస్తున్న హాహాకారాలు కూడా వారి కండ్లకు కేరింతలుగానే కనబడుతున్నాయంటూ పాలకుల కుటిలత్వాన్ని ఎండగట్టారు. చదువుకునే ఆడపిల్లలను హింసించడం, దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన క్రీడాకారులపై లైంగికదాడులకు పాల్పడిన ఉదాహరణలు కోకొల్లలు. వారందరికి ఐద్వా అండగా నిలబడింది. వారి తరపున పోరాటాలను నడిపింది..నడిపిస్తోంది.

ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, విధ్వంసం జరిగినా తొలుత నష్టపోయేది మహిళలు, పిల్లలే. సామ్రాజ్యవాద ఆసరాతో ఇజ్రాయిల్‌ గాజాపై చేస్తున్న దాడి ప్రాణాలు కోల్పోయినవారిలో మహిళలు, పిల్లలే అత్యధికులు. అందుకే పాలస్తీనాకు అండగా ‘ఐద్వా’ తీర్మానం చేసింది. వెనిజులాలో సామ్రాజ్యవాదం దిగంబరంగా చమురుపై అధిపత్యాన్ని పొందడానికి ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీచేసింది. ప్రజలెన్నుకున్న అధ్యక్షుడు మదురోను, అతని భార్యను అమెరికా నిర్భంధించడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండించింది. దేశంలో ‘సర్‌’ పేర ఓటర్ల లిస్టు నుంచి తొలగించబడుతున్న వారిలో దళిత, ఆదివాసి, మైనార్టీ మహిళలే అధికంగా ఉన్నారంటూ ఐద్వా మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న ‘సర్‌’పై ఐద్వా సమరం ప్రకటించింది.

మరల దేశంలో మధ్యయుగ భూస్వామ్య, ప్రగతి నిరోధక భావజాలం పెచ్చుమీరుతున్న వేళ ఈ మహాసభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో కోటి ఇరవై లక్షలకు పైగా సభ్యత్వం కల్గిన అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా ఉంది. వారందరికి ప్రాతినిథ్యం వహిస్తూ దేశవ్యాప్తంగా 850 మంది ప్రతినిధులు ఈ మహాసభలలో పాల్గొంటున్నారు. బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, వరకట్నాలు వంటి సామాజిక రుగ్మతలపై ‘ఐద్వా’ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ”ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది” అని గురజాడ అన్న మాటలను నిజం చేయడానికి ‘ఐద్వా’ కృషి చేస్తోంది. అందుకు ఆదివారం హైదరాబాద్‌ మహానగరంలో దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగిన నినాదాలే నిదర్శనం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -