జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్
నవతెలంగాణ-ఆలేరు టౌను
పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పారదర్శకంగా సేవలందించడమే పోలీస్ ప్రధాన లక్ష్యం అని, యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ సూపరిండెంట్, ఎస్పీ అక్షాంశ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో పోలీస్ కార్యాలయాన్ని క్షేత్రస్థాయిలో సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్కు సంబంధించిన నిర్వహణ తీరును పరిశీలించారు. రిసెప్షన్స్ , డెస్క్ ఫిర్యాదుల రిజిస్టార్లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే ప్రతి పౌరుడితో గౌరవంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. క్రైమ్ రికార్డులు , పెండింగ్ ఫైల్, మహిళలు , పిల్లలు బలహీనవర్గాల పైన జరిగే నేరాల సంబంధిత కేసులను వెనువెంటనే పరిష్కరించాలని చెప్పారు. సిఐ,ఎస్ఐ సిబ్బందికి పోలీసు వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాల గురించి వివరించారు. ప్రజల ఆస్తులు కాపాడడానికి, దొంగతనాలు అరికట్టడానికి, రాత్రి వేళలో పెట్రోలింగ్ వ్యవస్థ మరింత బలోపేతం చేయాలన్నారు.
అవినీతికి పాల్పడిన, విధుల్లో నిర్లక్ష్యం వహించిన, ఎఫ్ఐఆర్ నామాలు జాప్యం జరిగిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పమన్నారు. నేరాలు అదుపు చేయడానికి, ఫంక్షనల్ వర్టికల్ సిస్టం, వేలిముద్రల గుర్తింపు సాంకేతిక టెక్నాలజీ, సిసి టీవీ కెమెరా నెట్వర్క్ ను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. పట్టణంలోని చెక్పోస్ట్ ను సందర్శించి ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో సిఐ యాలాద్రి, ఎస్ ఐ ఎన్ వినయ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



