Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయం' పద్మ' వ్యూహాలు

‘ పద్మ’ వ్యూహాలు

- Advertisement -

ఎన్నికలు జరిగే రాష్ట్రాలే టార్గెట్‌!
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యర్థులకు అవార్డులు
అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దే అంతిమలక్ష్యం
ప్రతిష్టాత్మక పురస్కారాలకు రాజకీయ రంగు

న్యూఢిల్లీ : తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌, అసోం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాల్లో అసోం మినహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ ఇప్పటికీ అధికారం సాధించలేదు. ఇందుకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఈ ఏడాది పద్మ అవార్డుల ఎంపికలోనూ ఇదే విషయం వెల్లడైంది. ఇవి కేవలం గౌరవాలకే కాకుండా.. రాజకీయ సందేశాలుగా కూడా మారుతున్నాయన్న చర్చ అందరిలోనూ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ రాష్ట్రాలకు అత్యధిక పద్మ అవార్డులు లభించడం దీనిని స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

దేశంలోని ప్రతిష్టాత్మక పురస్కారాలతో కేంద్రంలోని మోడీ సర్కారు రాజకీయాలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అవార్డులను తిరస్కరించడం సీపీఐ(ఎం) చరిత్రలో ఒక స్థిరమైన విధానంగా ఉన్నది. 1990లలో కేరళ తొలి ముఖ్యమంత్రి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని నరసింహరావు ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్‌ను తిరస్కరించారు. 2022లో మోడీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్యాకు పద్మ భూషణ్‌ ప్రకటించింది. అయితే ఆయన ఆ గౌరవాన్ని స్వీకరించలేదు. ‘మా పని ప్రజల కోసం, అవార్డుల కోసం కాదు’ అని ఆ సమయంలో సీపీఐ(ఎం) స్పష్టంగా చెప్పింది.

కేరళకు పద్మ విభూషణ్‌ల వర్షం
తాజాగా ప్రకటించిన ఐదు పద్మ విభూషణ్‌ అవార్డుల్లో మూడు కేరళకు చెందిన ప్రముఖులకు లభించాయి. ఇందులో కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌తో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.టి థామస్‌, ఆరెస్సెస్‌కు చెందిన పి.నారాయణన్‌ ఉన్నారు. అలాగే ఎస్‌ఎన్‌డీపీ యోగం ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్‌, ప్రముఖ నటులు మమ్ముట్టికి పద్మ భూషణ్‌ దక్కాయి. కేరళలో చారిత్రకంగా అధికారిక ఎల్‌డీఎఫ్‌కు మద్దతుగా ఉన్న ఎజవ సమాజంలో తన బేస్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. వీ.ఎస్‌ అచ్యుతానందన్‌, ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌ ఇద్దరూ ఈ సామాజిక వర్గానికి చెందినవారే కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.

రాజకీయ చర్చలకు దారి తీసిన ‘భారతరత్న’
గతంలో కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న రాజకీయ చర్చలకు కేంద్రంగా నిలిచింది. 2019లో కాంగ్రెస్‌ పార్టీ మాజీ సీనియర్‌ నాయకులు, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి, 2024లో భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ నేత అయిన పి.వి నరసింహరావుకు, బీహార్‌ ప్రముఖుడు కర్పూరి ఠాకూర్‌, చౌదరి చరణ్‌సింగ్‌లకు కూడా భారత రత్న లభించిన విషయం విదితమే. ఈ ఏడాది రాష్ట్రాలవారీగా లభించిన పద్మ అవార్డులను పరిశీలిస్తే తమిళనాడుకు అత్యధికంగా 13 దక్కాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ (11), కేరళ (8), అసోం (5), పుదుచ్చేరి (1) ఉన్నాయి. పద్మ అవార్డులు కేవలం వ్యక్తిగత గౌరవాలుగా కాకుండా… ఎన్నికల వ్యూహాలు, సామాజిక వర్గాల సమీకరణ, రాజకీయ సందేశాల ప్రతిబింబంగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మోడీ ఎత్తుగడని సీపీఐ(ఎం) తెలిపింది. ప్రత్యేకంగా ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్రాల్లో అవార్డుల ఎంపిక యాదృచ్ఛికం కాదన్న వాదన బలపడుతోంది.

శిబూ సొరెన్‌కు పద్మ భూషణ్‌ దేనికి సంకేతం?
జార్ఖండ్‌ రాష్ట్ర మాజీ సీఎం, జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకులు శిబూ సొరెన్‌కు పద్మ భూషణ్‌ ఇవ్వడం కూడా రాజకీయంగా చర్చనీయాం శమైంది. ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ను 2024లో ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఆ సమయంలో జేఎంఎం దీనిని రాజకీయ కక్షగా అభివర్ణించింది. ఇప్పుడు ఆయనకు పద్మభూషణ్‌ లభించడం బీజేపీ రాజకీయంలో భాగమేనన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక శిబూ సొరెన్‌కు పద్మ భూషణ్‌ ప్రకటించిన అనంతరం.. జేఎంఎం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -