– కివీస్‌తో జరిగే చివరి 2 టీ20లకు దూరం
– నేరుగా ప్రపంచకప్ జట్టుతో చేరనున్న హైదరాబాదీ
నవతెలంగాణ-ముంబయి
భారత యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ నేరుగా టీ20 ప్రపంచకప్ బరిలోనే నిలువనున్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో తిలక్ వర్మ పొత్తికడుపు దిగువ భాగంలో గాయానికి గురి కాగా.. జైపూర్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న తిలక్ వర్మ.. వేగంగా కోలుకుంటున్నట్టు సమాచారం. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకే తిలక్ వర్మ దూరంగా ఉంటాడని తొలుత బీసీసీఐ వెల్లడించినా.. చివరి రెండు మ్యాచ్‌లకు సైతం అందుబాటులో ఉండటం లేదని తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. తిలక్ వర్మ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం అవసరమని వైద్య బృందం భావించింది. పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తిలక్ వర్మ కసరత్తులు చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండగా.. 4న భారత్ ఏకైక వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ చేశారు. 3న భారత జట్టుతో చేరనున్న తిలక్ వర్మ.. 4న నవీ ముంబయిలో దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లో ఆడతాడు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన తిలక్ వర్మ.. భారత టీ20 జట్టు బ్యాటింగ్ లైనప్‌లో కీలకంగా ఎదిగాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయగా.. చివరి రెండు మ్యాచ్‌లకు సైతం జట్టుతోనే కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్ లేకపోవటంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడికి అవకాశం రావటం లేదు. తిలక్ స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులో ఆడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. సుందర్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సమాచారం ఇవ్వాల్సి ఉంది.
మారుతున్న సమీకరణాలు!
తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కావటంతో.. భారత జట్టులో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దేశవాళీ టీ20 టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ నేరుగా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుని ఇప్పుడు ఏకంగా తుది జట్టులో చోటుపై కన్నేశాడు. తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో నం.4 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. తిలక్ స్థానంలో అయ్యర్ జట్టులోకి వచ్చినా.. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇషాన్ కిషన్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఓపెనర్‌గా వచ్చే కిషన్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం వెనక్కి తగ్గ నం.3 పొజిషన్ ఇచ్చాడు. రారుపూర్‌లో భారత్ 6/2తో ఒత్తిడిలో కూరుకున్న దశలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ జట్టు మేనేజ్మెంట్ను మెప్పించింది. జట్టు కష్టాల్లో కూరుకున్నప్పుడు ఆ తరహా ఇన్నింగ్స్ ఆడటాన్ని సూర్య ప్రశంసించాడు. ఇదే సమయంలో ఓపెనర్‌గా మరో వికెట్ కీపర్ సంజు శాంసన్ దారుణంగా విఫలం అయ్యాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 16 పరుగులే చేశాడు. ఇషాన్ కిషన్ రెండో టీ20లో 32 బంతుల్లోనే 76 పరుగులు పిండుకున్నాడు. కనీసం రెండు బంతులకు ఓ బౌండరీ బాది ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఫామ్‌లో కొనసాగుతుండగా.. టాప్ ఆర్డర్లో సంజు శాంసన్ ఒక్కడే నిరాశపరుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్‌లోకి వస్తే.. ఇషాన్ కిషన్‌ను బెంచ్‌కు పరిమితం చేయకుండా ఓపెనర్‌గా సంజు శాంసన్ స్థానంలో ఆడించాలనే ఆలోచన జట్టు మేనేజ్మెంట్లో మొదలైంది. సంజు శాంసన్ సైతం ఓపెనర్‌గా గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడినా ప్రస్తుతం అతడి ఆటతీరు నిరాశజనకంగా కనిపిస్తోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ సంజు శాంసన్ సత్తా చాటడంలో విఫలమైతే.. తుది జట్టులో తన స్థానాన్ని ఇషాన్ కిషన్‌కు కోల్పోవాల్సి ఉంటుంది.
కోలుకుంటున్న తిలక్ వర్మ
- Advertisement -
- Advertisement -



