Tuesday, January 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమంచి స్నేహితులం..భాగస్వాములం

మంచి స్నేహితులం..భాగస్వాములం

- Advertisement -

గణతంత్ర దినోత్సవ సందేశంలో జిన్‌పింగ్‌

బీజింగ్‌ : భారత్‌, చైనాలు ‘మంచి ఇరుగుపొరుగు దేశాలు… స్నేహితులు…భాగస్వాములు’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. డ్రాగాన్‌, ఏనుగు కలిసి నాట్యం చేయడం రెండు దేశాలకూ మంచిదని అని తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన సందేశం పంపుతూ ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయని, అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రెండు దేశాలు, వాటి ప్రజల ప్రాథమిక ప్రయోజనాల రీత్యా ఇది అవసరమని చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యాలను ముందుకు తీసుకుపోవడంలో ఈ సంబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. మంచి ఇరుగు పొరుగు దేశాలుగా, స్నేహితులుగా, భాగస్వాములుగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవడం, డ్రాగాన్‌-ఏనుగు కలిసి నృత్యం చేయడం రెండు దేశాలకూ మంచిదని చైనా భావిస్తోందని జిన్‌పింగ్‌ను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ తెలియజేసింది.

సహకారం, అభివృద్ధి అవకాశాలలో భారత్‌, చైనాలు భాగస్వాములు అనే ముఖ్యమైన ఏకాభిప్రాయానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉంటాయని జిన్‌పింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలు వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ను బలోపేతం చేసుకుంటాయని, మార్పిడి-సహకారాన్ని విస్తరించుకుంటాయని, ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకుంటాయని, ద్వైపాక్షిక సంబంధాలను ఆరోగ్యవంతంగా, స్థిరంగా అభివృద్ధి చేసుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా జిన్‌పింగ్‌ అభినందన సందేశాన్ని పంపారని సిన్హువా తెలిపింది. తూర్పు లఢక్‌ ప్రాంతంలో ప్రతిష్టంభన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు 2020 నుంచి దెబ్బతిన్నాయి. అయితే మోడీ, జిన్‌పింగ్‌ మధ్య రెండు శిఖరాగ్ర సమావేశాలు జరిగిన తర్వాత అవి మెరుగుపడడం ప్రారంభమైంది. ఇరువురు నేతలు 2024లో కజక్‌లో భేటీ అయ్యారు.

ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టులో ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా తియాంజిన్‌లో మరోసారి సమావేశమయ్యారు. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, సరిహద్దు సమస్యకు సమంజసమైన పరిష్కారం కనుగొనడానికి ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు గత ఆగస్టులో ఇరువురు నేతలు అంగీకరించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఘర్షణలకు స్వస్తి చెప్పిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు రెండు దేశాలు ప్రయత్నాలు జరిపాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు జారీ చేయడాన్ని గత జూలైలో భారత్‌ ప్రారంభించింది. కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రను తిరిగి ప్రారంభించడానికి, విమాన సర్వీసుల పునరుద్ధరణకు, వీసా నిబంధనలను సులభతరం చేయడానికి ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల మధ్య గత అక్టోబరులో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -