Tuesday, January 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురాజ్యాంగం వర్సెస్‌ రాక్షస పాలన

రాజ్యాంగం వర్సెస్‌ రాక్షస పాలన

- Advertisement -

వ్యతిరేకంగా వ్యవహరించడంలో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్‌
రాజ్యాంగ ఉల్లంఘనలపై హెచ్‌సీయూ విద్యార్థుల లఘు నాటిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన ‘ప్రజా పాలన’ సాగడం లేదనీ, కేవలం ‘రాక్షస పాలన’ సాగుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం కేటీఆర్‌ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన ‘న్యాయ పత్రం’లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారనీ, కానీ ఆ వేదికపైనే బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని గుర్తు చేశారు.

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్‌ న్యాయ పత్రంలో న్యాయం అంతే ఉందని ఎద్దేవా చేశారు. దాన్ని ‘అన్యాయ పత్రం’గా పిలవాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి ”బీఆర్‌ఎస్‌ జెండా గద్దెలను కూల్చేయండి”అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను సమాధి చేయడమేనని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. కోదాడలో దళిత యువకుడు కర్రా రాజేష్‌ను పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపారనీ, ఇది జరిగి 60 రోజులు గడిచినా సీఎం రేవంత్‌రెడ్డి కానీ, స్థానిక మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కానీ కనీసం స్పందించలేదని అన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్‌ చేస్తున్నారనీ, ఇది రాజ్యాంగ విలువల హననం కాదా?అని ప్రశ్నించారు. రైతు, యువజన, ఎస్సీ,ఎస్టీ,బీసీ డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాల ప్రజలనూ కాంగ్రెస్‌ మోసం చేసిందని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

రేవంత్‌రెడ్డి పాలనలో ‘ప్రజా పాలన’ మృగ్యమై ‘అనుముల రాజ్యాంగం’ నడుస్తోందన్నారు. ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఒకవైపు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న కాంగ్రెస్‌ మరోవైపు దేశానికి పెనుముప్పుగా మారాయని విమర్శించారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటాన్ని కేటీఆర్‌ అభినందించారు. బాధ్యత గల విద్యార్థులుగా విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నుంచి కాపాడుకోవడానికి వారు చేస్తున్న కృషి దేశాన్నే కదిలించిందని అన్నారు. ఆ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చెరబట్టే ప్రయత్నం సీఎం చేశారని విమర్శించారు. సుప్రీంకోర్టు గ్రీన్‌ బెంచ్‌ నియమించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఈ కుంభకోణం విలువ రూ.పది వేల కోట్లు ఉంటుందనీ, సీఎం ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌కు పాల్పడ్డారంటూ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ భారీ అవినీతిపై రాహుల్‌గాంధీ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -