యాజమాన్యానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలి
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నీచర్ దుకాణం దగ్ధం ఘటనలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు లక్షల పరిహారమిచ్చి చేతులు దులుపేసుకోకుండా రూ.25 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నాంపల్లిలో ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని సోమవారం సీపీఐ(ఎం) బృందం జాన్‌వెస్లీ సహా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ నేతృత్వంలో సందర్శించి పరిశీలించింది.
అనంతరం ఆ ఘటన ఎలా జరిగిందో పోలీసులు, స్థానిక నాయకులను వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ ఫర్నీచర్ దుకాణం దగ్ధం ఘటనలో ఐదుగురు మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం బాధాకరమని అన్నారు. చనిపోయిన ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. 20 ఏండ్లకుపైగా ఆ షాపులో పనిచేస్తున్న బేగం బీ అనే మహిళ, ఇద్దరు పిల్లలను కాపాడబోయిన కార్మికులిద్దరూ దట్టమైన పొగకు ఊపిరాడక సెల్లార్ల నుంచి బయటికి తీసుకురాలేక ప్రాణాలు విడిచారని విచారం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని బచ్చాస్ ఫర్నీచర్ షాప్ యజమాని సతీష్ భచ్చాస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏడాది కాలంలోనే మూడు అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయని అన్నారు. ఈ ప్రమాదాల్లో గుల్జార్‌హౌస్‌లో ఏడుగురు, శాలిబండలో ముగ్గురు, తాజాగా నాంపల్లిలో ఐదుగురు మరణించారని వివరించారు. ఫర్నీచర్ దుకాణాలు, బట్టల దుకాణాలు ఇరుకు గదుల్లో ఉంటున్నాయనీ, వాటికి జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. సెల్లార్ పార్కింగ్ కోసమే ఉండాలని సూచించారు. కానీ సెల్లార్‌లో దుకాణాలతోపాటు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నిద్ర పోతున్నారా? అని ప్రశ్నించారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ అధికారులు అలాంటి భవనాలకు అనుమతి ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీ కూడా మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫర్నీచర్ దుకాణాలను తనిఖీ చేయాలని కోరారు. గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసిన వస్తువులు ఉంటే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివాస ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేయడానికి అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా, గోషామహల్ జోన్ నేతలు పి నాగేశ్వర్, జి విఠల్, ఎం మీనా, కె జంగయ్య, ఎండీ బాబా, ఎండీ అయూబ్, అక్బర్ ఖాన్, బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



