Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంకన్నుల పండువగా కర్తవ్యపథ్‌

కన్నుల పండువగా కర్తవ్యపథ్‌

- Advertisement -

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవాలు
సైనిక వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సైనిక పాటవాన్ని చాటిన పరేడ్‌
ప్రత్యేక ఆకర్షణగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఆయుధ వ్యవస్థలు
సాంప్రదాయ బగ్గీలో యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ఆంటానియో కోస్టా, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌లు

న్యూఢిల్లీ : దేశ 77వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని సాయుధ బలగాల శక్తి సామర్ధ్యాలను, సైనిక పాటవాన్ని చాటేలా ఉత్సాహభరితమైన వాతావరణంలో, కన్నుల పండువగా పరేడ్‌ (కవాతు)ను నిర్వహించారు. ‘150సంవత్సరాల వందేమాతరం’ థీమ్‌ ప్రధానంగా కర్తవ్య పథ్‌లో ఈ ప్రదర్శన జరిగింది. బ్రహ్మోస్‌, ఆకాశ్‌, రాకెట్‌ లాంచర్‌ సూర్యాస్త్ర, ప్రధాన యుద్ధ ట్యాంక్‌ అర్జున్‌ సహా ప్రధాన ఆయుధ వ్యవస్థలను, క్షిపణులు, యుద్ధ విమానాలు, కొత్తగా ప్రారంభించిన యూనిట్లు అన్నింటినీ ఈ పరేడ్‌లో ప్రదర్శించారు. ప్రధానంగా దేశీయంగా అభివృద్ది చేసిన ఆయుధ వ్యవస్థలన్నీ ఈ పరేడ్‌లో కొలువుతీరాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో ఉపయోగించిన పలు దేశీయ ఆయుధ వ్యవస్థలతో వచ్చిన భారత సైనిక శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆపరేషన్‌ సిందూర్‌కు వాడిన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ అందరినీ ఆకట్టుకుంది. ‘వివిధత్వంలో ఏకత్వం’ అన్న ఇతివృత్తాన్ని ప్రదర్శించేలా సాగిన ఈ పరేడ్‌కు అగ్ర భాగాన దాదాపు వంద మంది కళాకారులు నాయకత్వం వహించారు. బ్రహ్మాండంగా సంగీత వాయిద్యాల ప్రదర్శనతో దేశ ఐక్యత, సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యతలను ప్రదర్శిస్తూ కవాతు సాగింది. పరేడ్‌కు ప్రారంభ సూచకంగా భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ప్రేక్షకులపై పూల జల్లులు కురిపించాయి. మరోవైపు గగనతలంలో యుద్ధ విమానాలు పలు ఆకృతులతో చేసిన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన నాలుగు హెలికాప్టర్లు కర్తవ్యపథ్‌పై ఎగురుతూ జాతీయ పతాకంతో పాటూ త్రివిధ దళాల పతాకాలను ప్రదర్శించాయి.

ఐఏఎఫ్‌ కు చెందిన రాఫెల్‌ జెట్‌లు వజ్రాంగ్‌ ఫార్మేషన్‌లో విన్యాసాలు నిర్వహించాయి. భారత స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖుల చిత్రపటాలతో స్కూలు పిల్లలు పరేడ్‌లో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు ఆంటానియో కోస్టా, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌లు సాంప్రదాయ బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకున్న వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక వందనాన్ని స్వీకరించారు. దాంతో పరేడ్‌ ప్రారంభమైంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పలువురు కేంద్ర మంత్రులు, దేశ త్రివిధ దళాధిపతులు, విదేశీ దౌత్యవేత్తలు, సీనియర్‌ అధికారులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ శుభాకాంక్షలు
వికసిత భారత్‌ను నిర్మించాలనే మన ఉమ్మడి కర్తవ్యంలో ఈ రోజు నూతన ఉత్సాహాన్ని, సంకల్పాన్ని నింపాలని ప్రధాని మోడీ దేశ ప్రజలకు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేశారు. వికసిత్‌ భారత్‌లో మహిళల పాత్ర శ్లాఘనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా కొనియాడారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు అందచేశారు.

విజయవంతమైన భారత్‌ ప్రపంచాన్ని మరింత సుస్థిరం చేస్తుంది : ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌
విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా, సంపద్వంతంగా, భద్రంగా తయారుచేస్తుందని యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ అన్నారు. దాన్నుండి మనందరం ప్రయోజనాలు పొందుతామన్నారు. భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఉత్సవాల అనంతరం సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -