ఐసీఈ ఏజెంట్ల చేతిలో మరో వ్యక్తి మృతి
నెలలో ఇద్దరి హత్య
తీవ్రంగా నిరసించిన స్థానికులు
అమెరికాలోని మిన్నెపోలిస్ ప్రాంతంలో ఘటన
మిన్నెపోలిస్ : అధ్యక్షుడు ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు దూకుడుగా అనుసరిస్తున్న తీరును ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. తాజాగా ఐసీయూలో పనిచేసే నర్సు అలెక్స్ ప్రెట్టి (37)ను ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపడంతో మిన్నెపోలిస్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు. ఐసీఈ ఏజెంట్లు వున్న హోటళ్ళ వెలుపల గట్టిగా నినాదాలు చేస్తూ వందలాదిమంది ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ చర్యల పట్ల తీవ్ర వ్యతిరేకతతో వున్న నేపథ్యంలో ఈ సంఘటన ఆజ్యం పోసింది. ఐసీఈ చర్యలు అత్యంత అమానవీయంగా వున్నాయని, ఈ దారుణాలకు జవాబుదారీని నిర్ధారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కుటుంబాలను నిట్టనిలువునా చీల్చేస్తున్నారని వారు విమర్శించారు. ‘ఇది పూర్తిగా హత్య తప్ప మరొకటి కాదు’ అని ఒక యువతి వ్యాఖ్యానించింది. ఇరుగు పొరుగున వున్న తామే ఇలాంటి ఘటనలను ఖండిస్తూ మాట్లడకపోతే ఇక దూరంగా వున్నవారేం మాట్లాడతారని ఆమె ప్రశ్నించింది. ఇవన్నీ అర్ధరహితమైన, అనాలోచితమైన చర్యలని పేర్కొంది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఒక మెమోరియన్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మృతుడికి నివాళిగా కొవ్వొత్తులు వెలిగించిన పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించారు.
డెమోక్రాట్ల నేతృత్వంలోని ఈ నగరంలో వలసలు అత్యధికంగా వుంటాయి. ప్రధానంగా ఈ నగరంలో సోమాలీ శరణార్ధులు ఎక్కువగా వుంటారు. ఇటువంటి చోట ఇలాంటి సంఘటనలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. గత కొద్ది వారాలుగా నగరంలో భారీగా వేల సంఖ్యలో ఫెడరల్ ఏజెంట్లను మోహరించారు. ఈ నగరంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అధికారులు చంపిన రెండో అమెరికన్ పౌరుడు ప్రెట్టి కావడం గమనార్హం. శనివారం జరిగిన ఘర్షణల సమయంలో ప్రెట్టి తమకు హానిచేయ తలపెట్టాడని, అందుకే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని ఫెడరల్ ఏజెంట్లు చెబుతున్నారు. కానీ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే వారు చెప్పింది పూర్తి అబద్ధమని తెలుస్తోంది. ప్రెట్టి ఎలాంటి ఆయుధాన్ని తీసి బెదిరించలేదు. పైగా ప్రెట్టిపై రసాయనాలు స్ప్రే చేసి, సెకన్ల వ్యవధిలో నేలపై ఈడ్చుకుంటూ వచ్చిన వెంటనే అతనిపై కాల్పులు జరిపినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు కారకుడైన అధికారిని ట్రంప్, ఆయన ప్రభుత్వం సమర్ధిస్తోంది. ఇంతవరకు ఆ అధికారిని సస్పెండ్ చేయడం గానీ లేదా అభియోగాలు మోపడం గానీ జరగలేదు. మిన్నపోలిస్ నివాసి రెనీ గూడ్‌ను ఇలాగే ఐసీఈ ఏజెంట్ కాల్చిచంపి మూడు వారాలు కూడా గడవక మునుపే ప్రెట్టి హత్య చోటు చేసుకుంది.



