నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా మేడారంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువులు అనారోగ్యానికి గురికాకుండా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. తాడ్వాయితో పాటు పరిసర గ్రామాల్లోని అన్ని రకాల పశువులకు వ్యాధి నిరోధక వాక్సిన్‌ను చేశారు. జాతర సందర్బంగా బండ్ల ద్వారా వచ్చే ఎడ్లకు వాక్సినేషన్ ఇచ్చేందుకు ఆరు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసారు. జాతర సందర్బంగా పశువులకు గడ్డి, గ్రాసం దొరికే పరిస్థితి ఉండనందున మేడారంతోపాటు మరో ఆరు గ్రామాల్లో పశువులకై గ్రాసం డిపోలను ఏర్పాటు చేశారు. జాతర అనంతరం భక్తులు వదిలిన బెల్లం ఇతర వ్యర్థాలను పశువులు తిని అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు జాతర అనంతరం కూడా ప్రత్యేక పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో ఉండే పశువులకు ఇంటికి వెళ్లి చికిత్స అందించేందుకు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ తరపున ఏడు వెటర్నరీ హెల్త్ క్యాంపులు, రెండు పౌల్ట్రీ చెక్ పోస్ట్‌లు, రెండు విజిలెన్సు బృందాలను ఏర్పాటు చేసి, వీటి నిర్వహణకు 73 మంది అధికారులు, వెటర్నరీ వైద్యులు, సిబ్బందిని నియమించారు. కాగా, జాతర సందర్భంగా వివిధ సేవలందించేందుకు రెండు వేల మంది స్థానిక ఆదివాసీ యూవత, 200 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు.
తప్పిపోయిన వారికి ఆరు కాంపుల ఏర్పాటు
మేడారం జాతరలో తప్పిపోయే పిల్లలు, మహిళలు, వృద్ధులను తిరిగి వారి బంధువులకు అప్పజెప్పేందుకు ప్రత్యేకంగా ఆరు మిస్సింగ్ పర్సన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ కాంపులలో తప్పిపోయి వచ్చే వారి సౌకర్యార్థం బాదం మిల్క్, బిస్కట్ ప్యాకెట్లు, బాలామృతం, ఉడక పెట్టిన గుడ్లు, భోజన సౌకర్యాలను కల్పించారు.
కల్తీ మద్యం, నాన్ పెయిడ్ మద్యం నిరోధానికి ఎక్సయిజ్ శాఖ ముమ్మర ఏర్పాట్లు
మేడారం జాతరలో అక్రమ మద్యంతో పాటు కల్తీ మద్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. కల్తీ మద్యాన్ని, గుడంబా తయారీని అరికట్టడం, ఆన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అడ్డుకోవడం, బెల్లంను దుర్వినియోగ పర్చకుండా చూడడంతో పాటు జాతర ప్రాంతంలో స్థానిక గిరిజనులకు లిక్కర్ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సయిజ్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. మేడారం జాతర సందర్బంగా ఏడు రోజుల పాటు 22 పర్మిట్‌లను స్థానిక గిరిజనులకు మంజూరు చేసింది. వీటితోపాటు, ఆరు చెక్ పోస్టులు, 15 మొబైల్ పెట్రోల్ పార్టీలు, ఒక కంట్రోల్ రూమ్, మరో సబ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎక్సయిజ్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మేడారంలో పశు రక్షణకు చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



