గొంతు కోసుకుపోయి మృతి
నవతెలంగాణ- కూకట్‌పల్లి
నిషేధిత మాంజా కారణంగా ఓ పసి ప్రాణం బలైంది. ఈ హృదయవిదారక ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ద్విచక్రవాహనంపై తల్లిదండ్రులతో కలిసి వెళ్తున్న ఐదేండ్ల చిన్నారి మెడకు మాంజా తగలడంతో తీవ్రంగా కోసుకుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కూకట్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ గోకుల్ ఫ్లాట్స్‌లో నివసించే రామ్‌సాగర్ దంపతులు సోమవారం తమ కుమార్తె నిష్విక దరియా(5)తో కలిసి బైక్‌పై పటాన్‌చెరు సమీపంలోని ఖాజీపల్లి గ్రామంలో ఇటీవల వారు కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లి అక్కడ జరుగుతున్న ఇంటీరియర్ పనులను పరిశీలించారు.
అనంతరం తిరిగి వస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ నగల దుకాణానికి వెళ్దామని అనుకొని వివేకానంద నగర్ జాతీయ రహదారిపై ప్రయాణించారు. గమనించకుండా దుకాణం దాటిపోవడంతో యూటర్న్ తీసుకునేందుకు వస్తుండగా పాప గొంతుకు నిషేధిత మాంజా చుట్టుకుని తీవ్రంగా కోసుకుపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా బిగ్గరగా అరవడంతో తండ్రి గమనించి చూసేసరికి తీవ్ర రక్తస్రావ మైంది. అప్రమత్తమైన తండ్రి చిన్నారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.



