Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంనేడు బ్యాంకుల సమ్మె

నేడు బ్యాంకుల సమ్మె

- Advertisement -

వేతన ఒప్పందంలో అంగీకరించిన అంశాలు సహా అన్ని డిమాండ్లు పరిష్కరించాలి :యూఎఫ్‌బీయూ

న్యూఢిల్లీ : ఇప్పటికే కుదుర్చుకున్న వేతన సవరణ ఒప్పందంలో అంగీకరించిన అంశాలు సహా తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాలని కోరుతూ బ్యాంక్‌ ఉద్యోగులు ఆఫీసర్‌ యూనియన్లు దేశవ్యాప్తంగా మంగళవారం సమ్మె చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా గల పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె పిలుపునిచ్చింది. తొమ్మిది ప్రధాన బ్యాంక్‌ యూనియన్లకు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తుంది. గతేడాది మార్చిలో కుదిరిన వేతన సవరణ ఒప్పందంలో భాగంగా అన్ని శనివారాలు బ్యాంక్‌ సెలవుదినాలుగా ప్రకటించాలన్న అంశానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కానీ ఆ హామీ ఇంతవరకు అమలు కాలేదు.
దీంతో పారిశ్రామిక వివాదాల చట్టం, 1947 కింద సమ్మె నోటీసును ఐబిఎకు, చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌కు, ఆర్థిక సేవల విభాగానికి యూఎఫ్‌బీయూ అందచేసింది.

”బ్యాంక్‌ ఉద్యోగులు తరచుగా తమ సంక్షేమాన్ని పణంగా పెట్టి భారతదేశ ఆర్థిక సుస్థిరతకు, పురోభివృద్ధికి తోడ్పడతారు. వారానికి ఐదు రోజుల పని దినాలేమీ రాయితీ కాదు, దీర్ఘకాలంగా అమలు కావాల్సిన సంస్కరణ, రాతపూర్వకంగా హామీ కూడా ఇచ్చారు, కచ్చితంగా ఇది అమలు చేయాల్సిందే” అనియూఎఫ్‌బీయూ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. ఐదు రోజులకు తగ్గించడం వల్ల ఉత్పాదకత తగ్గదని, ఇప్పటికే సోమవారం నుంచి శుక్రవారం వరకు అదనంగా 40నిముషాల పాటు పనిచేయడానికి ఉద్యోగులు అంగీకరించారని తెలిపింది. కాగా సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది కానీ అవి ఫలించలేదు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం వల్లనే తాము సమ్మెకు దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని యూనియన్లు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -