మనుస్మృతి నిబంధనల అమలుకు యత్నం : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్ వినరు కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు, సెక్యూలర్ పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్ చెప్పారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో జాతీయ జెండాను ఎగురేశారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఎస్వీకే ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామంటూ ప్ల కార్డు ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను కాపాడుకుందామంటూ వేదిక నాయకులు కామేశ్ బాబు ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం ‘రాజ్యాంగ పరిరక్షణ’ అంశంపై కామేశ్ బాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాల్సిన అవసరం నేడు మరింత పెరిగిందని వివరించారు.
రాజ్యాంగ నిర్మాణానికి ముందు ఎవరికీ హక్కులుండేవి కావని తెలిపారు. మనుస్మతి నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్పారు. ఆ నిబంధనల ప్రకారం చదువు, సంపద శూద్రులకు నిషేదమని గుర్తు చేశారు. కుల అంతరాలను మరింత కట్టుదిట్టం చేయటమే కాక, శూద్రులను, స్త్రీలను మనుషులుగా చూడ నిరాకరించిందని తెలిపారు. రాజ్యాంగం ఆమోదం తర్వాతే సార్వ జనీన ఓటు హక్కు అమల్లోకి వచ్చిందని వివరించారు. లౌకిక, ప్రజాస్వామిక విలువలకు రాజ్యాంగం ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. బీజేపీ ఆధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ ఎస్ ఎస్ విధానాలను అమలు చేసే క్రమంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి కి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంత, భాష వైషమ్యాలను పెంచే కుయుక్తులకు రాజ్యాంగం ఆటంకంగా ఉండటం వల్ల దాన్ని ధ్వంసం చేసేందుకు ఆ పార్టీ కుట్రలు పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాజ్యాంగ బద్ధ స్వతంత్ర సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. సర్వ మతాలను సమున్నతంగా చూడటాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నిరాకరిస్తున్నారని తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ బీవీఎస్ పద్మరాజు మాట్లాడుతూ చిన్న నాటి సామరస్య ధోరణి క్రమంగా కనుమరుగవుతున్నదనీ, ప్రజల మధ్య వైశమ్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సమైఖ్యతా భావానికి అర్థం లేకుండా పోతున్నదని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో మహిళల పాత్ర విడదీయ లేనిదని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే కొద్దిపాటిగా ఉన్న స్త్రీల హక్కులు హననానికి గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఇన్‌చార్జి కె సతీష్ కుమార్, హైదరాబాద్ జిందాబాద్ నాయకులు వీరయ్య, ఎస్వీకే డైరెక్టర్ జి బుచ్చిరెడ్డి తదితరులు మాట్లాడారు.
రాజ్యాంగ పీఠికలోని సోషలిస్టు, సెక్యూలర్ పదాలు తొలగించే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



