నవతెలంగాణ – హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాను ‘ఫెర్న్’ మంచు తుఫాను వణికిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం, గడ్డకట్టే మంచు వర్షం దేశంలోని దాదాపు 40 రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2,000 మైళ్ల మేర విస్తరించిన ఈ తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. తీవ్రమైన చలికి తట్టుకోలేక వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 29 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మైనస్ ఉష్ణోగ్రతల వల్ల బయట నివసించే ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, టెక్సాస్, లూసియానాలో హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) వల్ల పలువురు మరణించారు.
మిస్సిసిపీలో సంభవించిన చారిత్రక ఐస్ స్టార్మ్ వల్ల భారీగా చెట్లు విరిగిపడటంతో పాటు రోడ్లు ప్రమాదకరంగా మారాయి. మంచు భారం వల్ల విద్యుత్ లైన్లు తెగిపోవడంతో అనేక రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్లు దెబ్బతిన్నాయి. ఒక్క టెన్నెస్సీలోనే 3 లక్షల మందికి పైగా కరెంట్ లేక అవస్థలు పడుతుండగా, మిస్సిసిపీలో 1.5 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో, కేవలం 10 నిమిషాల పాటు బయట ఉన్నా చర్మం గడ్డకట్టే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.



