నవతెలంగాణ-హైదరాబాద్ : పట్టణ, నగర పేదలకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం. మీ సొంతింటి కలను నెరవేర్చే ఆలోచనకు కసరత్తులు చేస్తుంది. ఇదే నిజమైతే వచ్చే మూడు నెలల్లో మీకు ఇల్లు అందనుంది. ఇందుకోసం 72 గజాల స్థలం కేటాయించే విధంగా ఆలోచన చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా ఉండకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న పథకం.. ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అసలైన పేదలను గుర్తించి .. వారికి సొంతింటిని అందించాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వమే దాదాపుగా రూ.5 లక్షల రూపాయలను నేరుగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే వేల మంది పేదలకు సొంత ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నాయి.
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్ అందించింది. అది కూడా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్న పేదలకు. వీరికి 72 గజాల స్థలం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి! లేదా అర్హులను గుర్తించి ప్లాట్‌లో ఇళ్లు కట్టించే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం అధికారులతో సమావేశం అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల మహబూబాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి .. పేదలను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం మాదని తెలిపారు. అందుకోసమే రైతులకు పనిముట్లకు సబ్సిడీతోపాటు సన్నాలకు బోనస్ డబ్బులు కూడా అందిస్తున్నామని తెలిపారు. గతంలో కేసీఆర్ ఒక్క రైతు బంధు మాత్రమే ఇచ్చారని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం జోరుగా సాగుతుందని, అతి త్వరలో మరింత మంది పేదలకు అవకాశం వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మరో కీలక ప్రకటన కూడా చేశారు. పట్టణ, నగరంలో ఉంటున్న పేద ప్రజలకు ఇళ్లు మంజూరు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలో… అంటే వచ్చే మూడు నెలల్లో అర్హులను గుర్తించి వారికి ఇల్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు మంత్రి. అలాగే ఇప్పటికే ఇండ్లు పొందిన పేదలకు అతి త్వరలోనే పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి… కొత్త ఇంట్లోకి వెళ్లేలా సహకరిస్తామని అన్నారు.



