సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్
నవతెలంగాణ – బోనకల్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా బోనకల్ సీఐటీయూ మండల కన్వీనర్ గుగులోత్ నరేష్ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఫిబ్రవరి 12న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని, ఈ మేరకు ఎంపీడీవో రురావత్ రమాదేవికి మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను దేశంలోని అన్ని కార్మిక సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమ్మెలో మండలంలో గల అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు, హమాలీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ పెట్టుబడిదారులకు ఉపయోగపడే చట్టాలను తీసుకువస్తుందని ఆయన విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని ఎత్తివేసి 12 గంటల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నారు. దీనివలన కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోనే కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడవలసిన సమయం వచ్చిందన్నారు.
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మె ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది అన్నారు. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని తన నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి మరీదు పుల్లయ్య, అధ్యక్షుడు అంతోటి రమేష్, బిల్డింగ్ రంగం కార్మిక సంఘం జిల్లా నాయకులు షేక్ ఖాదర్ బాబా, సీఐటీయూ మండల నాయకులు బూర్గుల అప్పాచారి, మంద నాగరాజు, పూజాల రామారావు, తదితరులు, పాల్గొన్నారు.



