Tuesday, January 27, 2026
E-PAPER
Homeఖమ్మంమున్సిపల్‌ లో ముందస్తు ప్రచారం

మున్సిపల్‌ లో ముందస్తు ప్రచారం

- Advertisement -

– నోటిఫికేషన్‌ కు వారం ముందునుండే హడావుడి
– అభ్యర్థుల పరిచయం,ప్రాచుర్యం పూర్తి
– నామినేషన్‌ కు సిద్ధంగా ఆశావాహులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

వసంతం రాకముందే కోయిల కూసినట్లు, ఋతువు కంటే ముందే వానలు కురిసి నట్లు, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అశ్వారావుపేట మున్సిపల్ రాజకీయాలు వేడెక్కాయి. నోటిఫికేషన్‌ కు ఇంకా వారం సమయం ఉండగానే ప్రధాన పార్టీలు ముందస్తు ప్రచారం ప్రారంభించాయి. అశ్వారావుపేట ను నూతన మున్సిపాల్టీ గా గతేడాది జనవరి 4 న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.అప్పటి నుంచి కౌన్సిలర్, ఛైర్పర్సన్ ఆశావాహులు ఏడాది కాలంగా ఎన్నికల కోసం ఎదురుచూస్తూ వస్తున్నారు. 

ఈ నెల మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న సంకేతాలు రావడంతో, ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న అంచనాతో ఆశావాహులు ముందుగానే రంగంలోకి దిగారు. రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్, ఛైర్పర్సన్ ఆశావాహులు గత వారం రోజులుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థుల పరిచయ కార్యక్రమాలు పూర్తి చేయడమే కాక, ఒకటి రెండు దఫాలు ప్రచారం కూడా ముగించుకోవడం విశేషం.

సాధారణంగా నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత పోటీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ. అయితే ఈసారి ఆ దశలన్నింటికీ ముందే అభ్యర్థుల పేర్లు, ముఖాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి.

ఛైర్పర్సన్ అభ్యర్థులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జూపల్లి రమేష్ సతీమణి శశికళ, బీఆర్ఎస్ నాయకుడు కాసాని చంద్రమోహన్ సతీమణి నాగ శేష పద్మ ఇప్పటికే ప్రచారంలో ఉన్నారు. ఈ ముందస్తు కదలికలతో మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్, తదనంతర ఛైర్పర్సన్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠతో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -