– హాజరు కానున్న ఐదు కళాశాల విద్యార్థులు
– వెల్లడించిన ప్రిన్సిపాల్ అల్లు అనిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కేంద్రంగా ఈ సారి నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఎంపిక చేసారు. గతం లో ఏ కళాశాల విద్యార్ధులకు అదే కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించే వారు.కానీ ఈ సారి సంప్రదాయం పాటించకుండా సెక్టార్ కళాశాలలు విద్యార్ధులు అందరికి వేరే చోట పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ నిర్ణయించడం తో పారదర్శక పరీక్షా పద్ధతులకు పునాది వేసినట్లు అయింది.
ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత ఈ వివరాలను మంగళవారం నవతెలంగాణ కు వెల్లడించారు. వచ్చే సోమవారం నుండి అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే ఈ పరీక్షలకు దమ్మపేట మండలం మందలపల్లి లోని గిరిజన,సాంఘీక సంక్షేమ బాలురు కళాశాలలు,అంకంపాలెం గిరిజన బాలికల కళాశాల,అశ్వారావుపేట మండలం లోని స్థానిక ప్రభుత్వ కళాశాల,మైనార్టీ బాలికల కళాశాల ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్ధులు,వొకేషనల్ కోర్స్,బ్రిడ్జి కోర్స్ విద్యార్ధులు మొత్తం 609 మంది విద్యార్ధులు ప్రాక్టికల్ పరీక్షలకు రానున్నారని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు.



