రూ.16 కోట్ల రోడ్డుపై కాంట్రాక్టర్ రాజ్యం – మేడారం భక్తుల ప్రాణాలపై చెలగాటం
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చింతకాని మూల మలుపు నుంచి పెగడపల్లి వరకు రూ.16 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులు అవినీతి, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా, నాణ్యతను పూర్తిగా పక్కన పెట్టి పనులు కొనసాగిస్తున్నాడన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మేడారం మహాజాతరకు వెళ్లే ప్రధాన మార్గంగా ఉన్న ఈ రహదారి పనులు ఇలా నాణ్యత లేకుండా సాగితే రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు తప్పవన్న భయం భక్తుల్లో నెలకొంది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా, పనుల్లో మాత్రం కనీస ప్రమాణాలు పాటించకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
ప్రజల ప్రకారం, రోడ్డు నిర్మాణంలో వాడాల్సిన మెటీరియల్ నాసిరకంగా ఉండగా, లేయర్లు సరిగా వేయకుండా తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మధ్యలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించిన సిమెంట్ పనులు పూర్తిగా కురింగ్ చేయకుండానే వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, ఉన్నతాధికారులు మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులు కళ్లుమూసుకుని ఉంటేనే కాంట్రాక్టర్‌కు ఇంత ధైర్యం వస్తుందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాణ్యత లేని పనులు జరిగితే తక్షణమే నిలిపివేసి, స్వతంత్రంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.




