కాలం మారుతోంది. మార్పు సహజం. కానీ, ఆ మార్పు మన జీవన విధానాన్నే కాదు- మన ఆలోచనా ధోర ణిని, బంధాలను, విలువ లను కూడా మార్చేస్తోంది. ఒకప్పు డు కుటుంబమంటే భద్రత, సంరక్షణ, సంస్కారం. నేడు అదే కుటుంబం వ్యక్తుల సమా హారంగా మిగిలిపోతోంది. ప్రపంచీకరణ, ఆధునీకరణ, సాంకేతిక విప్లవం మన జీవితాన్ని సౌకర్యవంతం చేశాయన్నది వాస్తవం. అయితే ఆ సౌకర్యాల వెనుక మనిషి-మనిషి నుంచి దూరమవు తున్న చేదు నిజం దాగుంది. వేగం పెరిగింది. కానీ, సంబంధాల లోతు తగ్గింది. అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలా? వేగవంతమైన రహదారులా? లేక ఆదాయ గణాంకాలా? అభివృద్ధి నిజంగా మనిషిని మరింత మానవీయుడిగా మార్చకపోతే -అది పురోగతేనా? నేటి సమాజంలో ”నేను” అనే భావన ”మనం” అనే భావనను మింగేస్తోంది. వ్యక్తి స్వేచ్ఛ పేరుతో సామూహిక బాధ్యత, కుటుంబ ధర్మం పక్కకు నెట్టబడుతోంది.ఈ నేపథ్య ంలో కుటుంబ వ్యవస్థ ఎదుర్కొంటున్న మార్పులను-వాటి కారణాలు, ప్రభావాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే బహుళ తరాల సమ్మేళనం. తాత-బామ్మల అనుభవం, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల చైతన్యం కలిసిన జీవన పాఠశాల. సమస్య వచ్చినా పరిష్కారం ఇంట్లోనే దొరికేది. ఆనందమయితే అందరిదీ, బాధ అయితే పంచుకునేదీ. కానీ, నేడు ఆ కుటుంబం జ్ఞాపకంగా మిగిలింది. ఉద్యోగాలు, పట్టణ జీవనం, ఆర్థిక ఒత్తిళ్లు -ఇవన్నీ కలిసి చిన్న కుటుంబాల సంఖ్యను పెంచాయి. ఫలితంగా భావోద్వేగ భద్రత కంటే భౌతిక సౌకర్యాలకే ప్రాధాన్యం పెరిగింది. కుటుంష బంలో మారుతున్న అధికార సమీకరణ గతంలో కుటుంబ నిర్ణయాలు పెద్దల ఆధ్వర్యంలో సమిష్టిగా జరిగేవి. నేడు స్త్రీ-పురుషులు కలిసి నిర్ణయాలు తీసుకునే సమానత్వ విధానం పెరిగింది. ఇది ఒక సానుకూల పరిణామమే. అయితే, అదే సమయంలో మహిళలపై ద్వంద్వ బాధ్యతలు పెరిగాయి. ఇంటిపని -కార్యాలయ పని రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మహిళలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సమానత్వం పేరుతో భారం మాత్రం అసమానంగా మారింది.
వివాహం ఒక సామాజిక బంధం నుంచి వ్యక్తిగత నిర్ణయంగా మారింది. ప్రేమ వివాహాలు, సహజీవనం, వివాహాన్ని ఆలస్యం చేయడం లేదా పూర్తిగా తిరస్కరించడం వంటి ధోరణులు పెరుగుతున్నాయి. స్వలింగ భాగస్వామ్యాలపై చర్చలు, అంగీకారాలు కూడా సమాజంలో కొత్త దశను సూచిస్తున్నాయి. కానీ ఈ మార్పుల మధ్య బాధ్యత, సహనం, త్యాగం వంటి విలువలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఫలితంగా విడాకుల రేటు గణనీయంగా పెరిగింది. ఇది వ్యక్తిగత నిర్ణయంగా కనిపించినా, దీని ప్రభావం పిల్లలపై, సమాజంపై తీవ్రంగా ఉంటుంది. వృద్ధులు-కుటుంబం నుంచి సమాజం వరకు ఒంటరివారు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం-2007 ప్రకారం వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ సంతాన బాధ్యత. కానీ వాస్తవంలో వృద్ధులు ఆశ్రమాలకే పరిమిత మవుతున్నారు. పిల్లలు ఉద్యోగాల్లో నిమగమై, తమ ప్రపంచంలో తాము బిజీగా ఉండగా-వృద్ధులు ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఇది చట్టపరమైన సమస్య మాత్రమే కాదు, సాంస్కృతిక వైఫల్యం. సాంకేతికత- అనుసంధానమా? దూరమా? మొబైల్, సోషల్ మీడియా కుటుంబ సభ్యులను ఎప్పుడూ కలిపి ఉంచుతున్నాయా! అనిపిస్తుంది. కానీ, అదే సాంకేతి కత ముఖాముఖి సంభాషణలను తగ్గించి, బంధాలను ఉపరితల స్థాయికి పరిమితం చేస్తోంది.
ఇప్పుడు కృత్రిమ మేధ(ఏఐ) యుగంలోకి అడుగుపెడుతున్న వేళ..మానవ సంబంధాలకు మరింత సవాళ్లు ఎదుర్కోనున్నాయో! సత్ఫలితాలు ఇవ్వనున్నాయో రాబోవు కాలం నిర్ణయిస్తుంది. సానుకూల-ప్రతికూల ప్రభావాల సమీక్ష సానుకూ లంగా చూస్తే-పిల్లల విద్యపై శ్రద్ధ, తల్లిదండ్రుల పాత్ర పెరగడం, మహిళల స్వతంత్రత వంటి అంశాలు కనిపిస్తున్నాయి.అదే సమయంలో తరాల మధ్య దూరం, పిల్లల మానసిక ఒత్తిడి, వృద్ధుల నిర్లక్ష్యం, మహిళలపై అధిక భారం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ వ్యక్తివాదం పెరిగిన దుష్పరిణామాలే. ఇంటి గోడల మధ్య బంధాలు కూలితే -సమాజ భవనానికి పునాది ఎక్కడ నిలు స్తుంది? మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, విలువలు లేకపోతే అది ఎదుగుదల కాదు, ఒంటరితనం. అభివృద్ధి వేగానికి బ్రేక్ అవసరం లేదు, కానీ దిశ తప్పకుండా కావాలి.”నేను” నుంచి ”మనం” వైపు, వ్యక్తి నుంచి కుటుంబం వైపు, స్వేచ్ఛ నుంచి బాధ్యత వైపు మళ్లీ ప్రయాణం మొదలు పెట్టినప్పుడే సమాజం తన అసలైన శక్తిని తిరిగి పొందుతుంది. విలువలతో కూడిన కుటుంబాలే రేపటి వెలుగైన సమాజాన్ని నిర్మిస్తాయి.అదే ముందున్న మార్గం, అదే మన ముందున్న బాధ్యత.
మేకిరి దామోదర్
9573666650



