ప్రశ్న జ్ఞానానికి మూలం అనేక ఆవిష్కరణలకు అదే ఆధారం. ప్రశ్న ప్రగతికి దోహదకారి. ఇదో కోణం. మరో కోణంలో ప్రశ్నపాలకులకు మింగుడు పడనిది. ప్రశ్నించేవాడు నేరస్తుడు, సంఘ వ్యతిరేకి, ఇంకా తీవ్రవాది కూడా కావచ్చు. భారత న్యాయ సహితలోని అనేక సెక్షన్లు చట్టాల ప్రకారం ప్రశ్నించే వాడిపై ఎన్ని రకాల కేసులయినా పెడతారు. ఇది శతాబ్దాల నాటి నుండి ప్రపం చాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధి. మనదేశంలో ఇంకాస్త ఎక్కువ. భూమి గుండ్రంగా ఉందని చెప్తే నాడు శిక్షించారు. శాస్త్రం మతం కంటే మత విశ్వాసాల కంటే గొప్పది కాదంటూ శాస్త్రాన్ని బోధించిన వారిని రకరకాలుగా హింసించారు. జ్ఞానం తెలుసుకోమని, ప్రశ్నించడం నేర్చుకోమని బోధించినందుకు సోక్రటీస్‌కు విషమిచ్చి చంపారు. అదంతా అనాగరిక యుగం, రాతి యుగం, రాచయుగాల నాటి మాటలుగా అనుకుంటే నేడు దేశంలో ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తున్నదని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ భావప్రకటనా స్వేచ్ఛ కేవలం పుస్తకాలకు కాగితాలకే పరిమితమైంది. గత పదేళ్లలో (అంతకుముందు కూడా) ప్రభుత్వాలను ప్రశ్నించే వారి గొంతుక క్రమంగా మూగబోతున్నది. వారు ఈ లోకం నుండి కనుమరుగవుతున్నారు. పాలకపక్షాలకు ప్రశ్న అంటే గిట్టదు. ప్రశ్నిం చేవాడు ఉన్మాది, ఉగ్రవాది. గౌరీలంకేష్ లాంటివారు ఎంతోమంది హతులైనారు. మరెందరో జైళ్లలో మగ్గుతున్నారు.
అతడు ఒక 14 ఏళ్ల పిల్లవాడు. యువకుడని చెప్పడానికి ఇంకా వయసు చాలదు. అనేక పుస్తకాలు చదువుతుంటాడు. భగత్‌సింగ్, డాక్టర్ అంబేద్కర్ రచనలు అతడికి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయి, స్ఫూర్తి కలిగించాయి. అదే క్రమంలో తన సెల్‌ఫోన్‌లో రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అన్యాయాలను వ్యవస్థాగత లోపాలను, దుర్మా ర్గాలను అతడు వేలెత్తి చూపిస్తున్నాడు. అది యూపీ రాజ్యానికి నచ్చలేదు. దీంతో లక్నోలో ఉన్న ఆ కుర్రాడు పాలకుల కంటిలో నలు సుగా మారాడు. అరెస్ట్ కూడా చేశారు. కానీ, అతడి వయస్సు తక్కువ కావడంతో అదే కారణాలతో అతడి అన్నను అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అరెస్టుకు మాత్రం అమాయకుడైన అన్న ప్రత్యామ్నాయం కావడం ఆశ్చర్యం. అశ్వమిత్‌గౌతమ్ ఒక దళిత విద్యార్థి. సమాజంలో నెలకొన్న అసమానతలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై తనకున్న జ్ఞానాన్ని ఇన్‌స్టాలో పంచుకుంటున్నాడు. అందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తి పోయింది. అతడికున్న 1.5 నుండి రెండు మిలియన్ల ఫాలోయింగ్ సర్కార్‌ను గడగడలాడించింది.అంటే అంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక కుర్రవాడు, సరిగ్గా నూనూగు మీసాలు రాని పిల్లవాడు ఇన్‌స్టాలో చేస్తున్న విమర్శలకు వేస్తున్న ప్రశ్నలకు భూకంపం వచ్చినట్లు కదిలిపోయింది. ఎందుకింత బేల తనం, తెంపరితనం? జవాబులు చెప్పే సామర్థ్యం యంత్రాంగానికి లేదా? సరిచేసుకునే అవకాశం లేదా? సర్దిచెప్పుకునే మనసు లేదా? లేదంటే ఆ ప్రశ్నలు సమాజాన్ని ఆలోచింపజేసి తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాయన్న భయమా? ప్రశ్నను తట్టుకోలేని వారు, ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారు ప్రజాస్వామిక వాదులెలా అవుతారు? అది కేవలం నియంతృత్వమో లేక రాచరికమో అయి ఉండాలి.
ఒకప్పుడు పాఠశాలల్లో ప్రశ్నించకుండా మౌనంగా తరగతి గదిలో ఉండేవాడిని చాలా బుద్ధిమంతుడు అనేవారు. ప్రశ్నించే వాడని కోప్పడేవారు, కసురుకునేవారు. కాలక్రమంలో అది మారింది. ఇప్పుడు ప్రశ్నించమని టీచర్లే విద్యార్థులను కోరుతున్నారు. అంటే తరగతి గది చురుకుగా సజీవంగా సాగాలనేది వారి ఆకాంక్ష. ప్రశ్నించమని కోరే పెద్దలు తమ పై అధికార యంత్రాంగాన్ని ఏమి ప్రశ్నించరు. అదే విధంగా ప్రభుత్వాలలోనూ ఇదే కొనసాగుతున్నది. ఇక్కడ అశ్వమిత్ విషయంలోనూ అదే జరిగింది. ఆ కుర్రవాడు ఇన్‌స్టాలో పంచుకున్న భావాలు, వేసిన ప్రశ్నలు చాలా నిజాయితీతో కూడినవి. అతనికేమీ ఉద్యమ నేపథ్యం లేదు. అతని వెనుక ఏ శక్తి కూడా లేదు. తనకు తెలిసిన భాష హిందీలో, తన స్థాయిలో సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అశ్వమిత్ అనర్గళంగా మాట్లాడి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అతడేమీ జర్నలిస్టులాగా, రాజకీయ నాయకుడిలాగా కాకుండా సగటు పౌరుడిగా, సామాన్య మానవుడిగా పరిపక్వత, అపరిపక్వతల కలయికగా మాట్లాడిన మాటలు ప్రభుత్వ యంత్రాంగానికి చెమటలు పట్టించాయి. అందులోనూ విషయాలు వారికి అభ్యంతరకరమై నవిగా, విద్వేషపూరితమైనవిగా, విద్రోహభరితమై నవిగా అనిపించి అతనిపై కేసు నమోదు చేశారు. అతను సోషల్ మీడియా నిబంధనలను అతిక్రమించిన దాఖలాలు కూడా లేవు.
ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు రీల్స్ చేస్తున్నాడే కానీ, అతడే రియల్ హీరోగా నేడు దేశవ్యాప్తంగా అభినందించ బడుతూ, అభిమానించ బడుతు న్నాడు. అతడి ప్రశ్న ప్రభుత్వ పునాదులను పెకిలించిందా? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంత బలహీనమైనదా? సోషల్ మీడియా ప్రభావం చాలా బలమైనదే. కానీ 2014 నుండి బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించే కదా అధికారంలోనికి వస్తున్నది. తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నది. సామాజిక సమస్యలను ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం చట్ట వ్యతిరేకమా? రాజ్యాంగ వ్యతిరే కమా? సంఘ విద్రోహమా లేక దేశద్రోహమా? వ్యవస్థీకృతమైన లోపాలను బహిర్గతం చేయడమే అతడి నేరమా? లేదంటే అతడికి అంతమంది అభిమానులు కావడం ప్రభుత్వం భరించలేకపోయిందా? తమ కాళ్ల కింద నేల కదిలిపోవడం, తమ ప్రభుత్వం కూలిపోవడం అన్నంతగా స్పందించడం ఆశ్చర్యం. తమ ప్రభుత్వంలో తప్పు లేకపోతే తప్పు జరగకపోతే ప్రభుత్వం అంత ఉలిక్కిపడవలసిన అవసరం లేదేమో! భుజాలు తడుముకోవాల్సిన అగత్యం లేదేమో! అశ్వమిత్ గౌతమ్ ఒక విద్యార్థి మాత్రమే. ఒక నిరంతర అధ్యయనశీలి. అతడు చదివిన పుస్తకాలలోని సారాన్ని తన నిజజీవితంలోని పరిస్థితులకు అన్వయం చేసుకున్నాడు. సామాజిక రుగ్మతలను తనదైన శైలిలో భాషలో వ్యక్తీకరించాడు. బీజేపీ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ను, చిన్న భగత్‌సింగ్‌ను గౌరవిస్తున్నట్లుగా అనేకసార్లు పేర్కొంటోంది. అంటే అదంతా నిజం కాదా? ఈ పిల్లవాడు వారినే కదా అనుసరిస్తున్నాడు. వారి బాటలోనే కదా నడుస్తున్నాడు. ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉక్రోషం? తమనెవరు ప్రశ్నించ కూడదా? రాజ్యాంగంలో ఉటంకించిన భావప్రకటన స్వేచ్ఛ బీజేపీ పాలిత రాష్ట్రాలలో పుస్తకాలకే పరిమితమా? దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని తన పరిమిత జ్ఞానంతో తన అవగాహనతో వాక్‌పటిమతో గడగడలాడించడం నిజంగా అభినందనీయం. పాత్రికేయుడు కాదు, రాజకీయ నేత కానే కాదు, ఉగ్ర మూలాలు ఉన్నవాడు అసలే కాదు. కేవలం ఒక విద్యార్థి. సామాజిక స్పృహ కలిగిన వాడు. సామాజిక అధ్యయ నంలో తన తోటి వారి కంటే ముందున్నవాడు. విజ్ఞత, విచక్షణ కలవాడు. వివక్షను ఎదుర్కొంటున్న వాడు. అతడి ప్రశ్న ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పుడు ప్రభుత్వం తనకు తాను ప్రశ్నించుకోవలసిన పరిస్థితి నెలకొన్నది. హ్యాట్సాఫ్ టు అశ్వమిత్ గౌతమ్. ఈ దేశం అలాంటి విద్యార్థులను నిజంగా అభినందించాలి, ఆహ్వానించాలి.
శ్రీశ్రీ కుమార్
9440354092



