– సాయుధ పోరాటాన్ని కండ్లకు కట్టినట్టు చూపిన పీఎన్‌ఎమ్ కళాకారులు
– ఆసక్తిగా తిలకించిన ఐద్వా మహాసభ డెలిగేట్లు
– దొరపైకి ఖాళీ బాటిళ్లను విసిరిన పలువురు ప్రతినిధులు
– నాటకం ఆసాంతం చప్పట్లు, స్టెప్పులతో కళాకారులకు ప్రోత్సాహం
– ఎర్రజెండ..ఎర్రజెండ ఎన్నియల్లో పాటకు హోరెత్తిన ప్రాంగణం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘అదిగో పిలుస్తోంది వీర తెలంగాణం..వీరులెందరో నేలకొరిగిన పోరు తెలంగాణం’ అంటూ ప్రజానాట్యమండలి కళాకారుల బృందం ప్రదర్శించిన వీర తెలంగాణ వీధి నాటిక ఐద్వా మహాసభ ప్రతినిధుల్లో జోష్ నింపింది. ఆసక్తిగా తిలకించడమే కాదు..దొర ఆగడాలను ఎదురించిన సంఘపోళ్లు దొరపై తిరగబడే క్రమంలో కొందరు డెలిగేట్లు ఖాళీ బాటిళ్లు విసరడాన్ని బట్టే ఆ వీధి నాటిక ద్వారా వారు ఎంత చైతన్యం పొందారో చెప్పొచ్చు. నాటకం ఆసాంతం వచ్చే పాటలకు చప్పట్లతో పాటు గళం కూడా కలిపారు. కొందరు డెలిగేట్లు జోష్‌తో స్టెప్పులు కూడా వేశారు. లాల్‌జెండా జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించారు. ఎర్రజెండ..ఎర్రజెండ ఎన్నియల్లో పాటకు ప్రాంగణం అంతా ఈలలు, కేకలు, చప్పట్లతో మారుమోగిపోయింది. దొరలు, దేశ్‌ముఖ్‌లు గ్రామాల్లో పేదల భూములను లాక్కున్న తీరును ‘భూమి గుంజుకున్నరు..బువ్వ గుంజుకున్నరు’ అంటూ ఆనాటి సామాజిక పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చూపారు. ‘పల్లెపల్లెన సంఘం పుట్టెను చందామామయ్యలో..గుడిసె గుడిసె వెలుగులు నింపే చందామామయ్యలో’ అంటూ ఆనాడు దొరల ఆగడాలకు వ్యతిరేకంగా సంఘం ఏర్పడిన తీరును చక్కగా వివరించారు. ఆరుగాలం రెక్కలను ముక్కలు చేసుకుని పండించిన ధాన్యాన్ని దొరలు గుంజెకెళ్లే క్రమంలో ‘ఆగండ్రా..ఎవడబ్బ సొమ్మనుకుంటున్నార్రా’ అంటూ ఐలమ్మ తిరగబడిన తీరును కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. కష్టజీవుల అండగా జరుగుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్యను స్మరించుకుంటూ…’ఎర్రజెండా ఎత్తిన వీరుడో కొమురయ్యో…నీవు ఎక్కడ ఉన్నావు కొమురయ్యో..నిన్ను చంపిన ద్రోహులు నీ ఆశయాన్ని చంపలేరు..దాన్ని ముందుకు తీసుకెళ్తాం’ అంటూ హృదయవిదారంగా పాట పాడిన తీరు ఆకట్టుకున్నది. ‘బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతవ్ కొడకో నైజాం సర్కారోడా’ అంటూ నైజాంపై ఎర్రజెండా నేతృత్వంలో ఆనాడు సంఘపోళ్లు తిరగబడిన తీరును, దొరలను, దేశ్‌ముఖ్‌లను, నిజాం సైన్యాన్ని గ్రామాల నుంచి తరిమికొట్టిన తీరును పాటల ద్వారా కండ్లకు కట్టినట్టు చూపెట్టారు. ఈ వీధినాటకం ప్రదర్శనను డెలిగేట్లంతా ఆసక్తితో తిలకించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగువేల మంది అమరవీరుల త్యాగాలతో మూడు వేల గ్రామాల విముక్తి కల్పించి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన తీరును ప్రజానాట్యమండలి కళాకారులు చక్కగా వినిపించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ సమన్వయంతో, రాష్ట్ర అధ్యక్షులు పి.ఆనంద్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్, సాంగ్స్‌తో వీధినాటిక ప్రదర్శించబడింది.
వీర తెలంగాణ వీధి నాటక ప్రదర్శనకు ముందు ‘ఆ సుత్తే మా నాన్న.. ఆ కొడవలే మా అమ్మ..’ అంటూ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు పాడిన పాటకు డెలిగేట్లు సైతం స్టెప్పులేశారు.
స్ఫూర్తి నింపిన వీర తెలంగాణ వీధినాటిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



