Wednesday, January 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏడున్నర గంటలు మాజీ ఎంపీ సంతోశ్‌రావు విచారణ

ఏడున్నర గంటలు మాజీ ఎంపీ సంతోశ్‌రావు విచారణ

- Advertisement -

ఎస్‌ఐబీ జరిపిన ఫోన్‌ట్యాపింగ్‌లో
మీ పాత్ర ఏంటీ..? సిట్‌ ఆరా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ సంతోశ్‌రావును సిట్‌ అధికారులు మంగళవారం ఏడున్నర గంటలు సుదీర్ఘంగా విచారించారు. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో అప్పటి ఎస్‌ఐబీ అధికారులకు మీరెంత వరకు సహకరించారు. అందులో మీ పాత్ర ఎంత అని సంతోశ్‌రావును సిట్‌ అధికారులు సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావులతో మీకు ఎలాంటి సంబంధాలున్నాయి. వారికి కొన్ని ఫోన్‌ నెంబర్లను మీరు పంపించిన మాట వాస్తవమేనా అంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే తాను ఎవరికీ ఎలాంటి ఫోన్‌నెంబర్లను పంపించలేదని సంతోశ్‌రావు సమాధానం ఇవ్వగా కొన్ని కాల్‌ రికార్డ్స్‌ను ఆయనకు సిట్‌ అధికారులు చూపించినట్టు తెలిసింది. అలాగే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన మీరు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుల సర్వీస్‌లను పొడిగించడంలో కీలకపాత్ర వహించారని తెలుస్తోందని, ఇది నిజమేనా అని సిట్‌ ప్రశ్నించగా, తాను హౌంమంత్రిని కాదని, ఇందులో ఎలాంటి సంబంధం తనకు లేదని సంతోశ్‌రావు జవాబు ఇచ్చినట్టు తెలిసింది. కేసీఆర్‌ ఏమైనా ఫోన్‌నెంబర్లను మీ ద్వారా ప్రభాకర్‌రావుకు, రాధాకిషన్‌రావులకు పంపించారా? అన్న ప్రశ్నకు అలాంటిది ఏమీలేదని సంతోష్‌ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. కాగా కొందరు ప్రయివేటు వ్యక్తులను, వ్యాపారులను మీరు చెప్పిన మేరకు ఎస్‌ఐబీ అధికారులు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారా అనే ప్రశ్నకు సైతం సంతోశ్‌రావు నో అనే సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాగా గతంలో తాము ప్రశ్నించిన అధికారులు సంతోశ్‌రావుకు ఇచ్చిన సమాచార వాంగ్మూలాన్ని ఆయన ముందుపెట్టి ప్రశ్నించగా, ఆయన మౌనం వహించినట్టు తెలిసింది. వీటితోపాటు మరికొన్ని ప్రశ్నలను కొంత సమయం తీసుకుని సిట్‌ అధికారులు సంతోశ్‌రావుపై సంధించినట్టు సమాచారం.

సిట్‌ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు సంతోశ్‌రావు మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ జరుగుతుండగా వెలుపల సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు చేరుకుని ఆయనను ఎంతసేపు విచారిస్తారంటూ అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని పోలీసులు తోసివేయగా, వికలాంగుడైన ఒక నాయకుడు కిందపడిపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, విచారణ పూర్తయ్యాక రాత్రి 10 :30 గంటల ప్రాంతంలో సంతోశ్‌రావు సిట్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అవసరమైతే మరో సారి పిలుస్తామని ఆయనకు సిట్‌ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -