బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలి
సీఎం అంటే కోల్ మాఫియా నాయకుడు : బొగ్గు స్కాంపై ఆధారాలతో గవర్నర్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిర్యాదు
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి కుంభకోణంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోక్‌సభవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకుల బృందం కలిసి బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఫిర్యాదు చేసింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో గవర్నర్‌కు వివరమైన నివేదికను అందజేశామని చెప్పారు. ఆధారాలతో సింగరేణి కుంభకోణాన్ని బయటపెట్టామనీ, దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని సిట్ పిలుస్తున్నదని అన్నారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదనీ, కోల్ మాఫియాకి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. రూ.పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి, సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆటకి వినియోగించారని అన్నారు. పారదర్శకతకు పాతరవేసి సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం ఎందుకు తెచ్చారో సమాధానం చెప్పడం లేదన్నారు. 2018 నుంచి 2024 వరకు ఆ నిబంధన కేంద్రం సిఫారసు చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని గుర్తు చేశారు. ఈ తొమ్మిది నెలల్లో సైట్ విజిట్ సర్టిఫికెట్లను సింగరేణి సంస్థ ఎన్ని జారీ చేసిందో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో రింగ్ మాస్టర్ సృజన్‌రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బామ్మర్ది అవునా కాదా అని అడిగితే ఇంతవరకు సమాధానం రాలేదన్నారు. నైనీ టెండర్లే కాకుండా మిగతా టెండర్లనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ పవర్ స్కామ్ గురించి బయట పెట్టామని అన్నారు. అన్ని విషయాలనూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇందులో జోక్యం చేసుకోవాలనీ లేదంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరామని వివరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థను, అటు సోలార్ పవర్‌లో కుంభకోణం, ఇటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం జరిగిందనీ, దీన్ని అడ్డుకోవాలని విన్నవించామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కుంభకోణంపై విచారణ జరపండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



