Wednesday, January 28, 2026
E-PAPER
Homeజాతీయంటీఎంసీదీ ఆరెస్సెస్‌ ఎజెండానే..

టీఎంసీదీ ఆరెస్సెస్‌ ఎజెండానే..

- Advertisement -

– బెంగాల్‌లో విద్యా, ఆరోగ్యరంగాలు ధ్వంసం
– సర్‌తో మహిళల ఓటు హక్కుకు తూట్లు
– నేటి యువతతోనే మార్పు సాధ్యం
– ‘నవతెలంగాణ’తో బెంగాల్‌ మాజీ ఎంపీ మాలినీ భట్టాచార్య
తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీది కూడా ఆరెస్సెస్‌ ఎజెండాయేనని పశ్చిమ బెంగాల్‌ సీపీఐ (ఎం) నేత, మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ మాలినీ భట్టాచార్య విమర్శించారు. మమతా బెనర్జీ పాలనలో ఆ రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపారు. పరిశ్రమలు, ఉపాధి కల్పనారంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీచర్లకు కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని చెప్పారు. బెంగాల్‌కు చెందిన మాలినీ భట్టాచార్య 1989లో జాదవ్‌పూర్‌ పార్లమెంటరీ నియో జకవర్గం నుండి సీపీఐ (ఎం) అభ్యర్థిగా పోటీచేసి.. బలమైన నాయకురాలు మమతా బెనర్జీని ఓడించి దేశం దృష్టిని ఆకర్షించారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌ సభ్యురాలుగా అనేక జాతీయ సమస్యలపై గళమెత్తారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహసభలకు హాజరైన ఆమె ‘నవతెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…

బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వ పాలన ఎలా ఉంది..?
టీఎంసీ హయంలో రాష్ట్రంలో అనేక ప్రభుత్వ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. విద్య, వైద్యం, పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.

బీజేపీపై మమత పోరాటాన్ని నమ్మవచ్చా..?
అందరూ ఊహించినట్టుగా అక్కడ ఆ రెండు పార్టీల మధ్య అలాంటి పోరాటం ఏమీ లేదు. టీఎంసీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందముంది. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఆరెస్సెస్‌ అజెండానే టీఎంసీ వేరే రూపంలో అమలు చేస్తోంది. ప్రభుత్వ నిధులతో దేవాలయాల నిర్మాణం చేపడుతూ ప్రజలను లౌకికవాదం నుండి మతపరమైన విభజన వైపు మళ్లిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ సాయంతో పేదలు, మైనారిటీల ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు ఆలస్యంపై మీ అభిప్రాయం..?
ఈ బిల్లు కోసం మేం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. కానీ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీ సర్కార్‌ దీన్ని వాయిదా వేస్తోంది. ఆ పార్టీ కుట్ర పూరితంగానే బిల్లు అమలును వాయిదా వేస్తోంది. దాన్ని తొక్కిపెట్టడమంటే మహిళా లోకాన్ని వంచించడమే. తక్షణం దీన్ని అమల్లోకి తేవడం ద్వారా మహిళలకు రాజకీయాల్లోనూ అవకాశాలు పెరుగుతాయి.

ఆర్‌జికర్‌ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా..?
ఆర్‌జికర్‌ మెడికల్‌ కాలేజీ ఘటన కేవలం ఒక నేరం మాత్రమే కాదు. ఇది ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యానికి, సామాజిక పతనానికి నిదర్శనం. ఈ ఘటన వెనుక మెడికల్‌ కాలేజీల్లో మాఫియా, అవినీతి నెట్‌వర్క్‌ ఉందని నిరూపణ అయ్యింది. బెంగాల్‌లో క్రైమ్‌ రేటు పెరగడానికి అధికార పార్టీ అండదండలతో సాగుతున్న అరాచకాలే కారణం. నేరస్తులకు రాజకీయ రక్షణ లభిస్తుందనడానికి ఇదో నిదర్శనం. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం తెచ్చిన ‘అపరాజిత బిల్లు’ కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. పని ప్రదేశాల్లో, పాఠశాలల్లో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.

గృహిణులకు వేతనాలు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఎందుకు భావించింది?
గృహిణులు చేసే పనికి విలువ లేకపోవడం వల్లే సమాజంలో స్త్రీకి గౌరవం తగ్గుతోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం గహిణులకు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ఒక గొప్ప ప్రత్యామ్నాయాన్ని చూపింది. ఒక స్త్రీ ఇంట్లో చేసే పని కేవలం కుటుంబానికి మాత్రమే కాదు.. అది ఒక సామాజిక శ్రమ అని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు కేవలం వామపక్ష ప్రభుత్వాల వల్ల మాత్రమే సాధ్యమవుతాయి.

మీరు మమతా బెనర్జీని ఎలా ఓడించగలిగారు..?
1989 ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించడం ద్వారా ఆ గెలుపుతోనే చరిత్రలో నిలిచిపోయిందని నేను అనుకోవడం లేదు. ఆ విజయం నా వ్యక్తిగత ఘనత కంటే.. అప్పట్లో బెంగాల్‌లో ఉన్న సీపీఐ (ఎం) యంత్రాంగం, ప్రజా సంఘాల పటిష్టమైన పనితీరు వల్ల సాధ్యమైంది. అది ఒక సామూహిక విజయం.

యువతకు మీరిచ్చే సందేశం…
నేటితరం ఒంటరితనంతో, సామాజిక వాస్తవాలకు దూరంగా పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా తాము నిర్దేశించిన చట్రంలోనే తమ పిల్లలు ఉండాలని భావిస్తున్నారు. విద్యార్థులను కేవలం మార్కుల యంత్రాలుగా మారుస్తూ, వారిని సామాజిక స్పృహ లేనివారిగా పెంచడం ఆందోళనకరం. కానీ అస్సాం వంటి రాష్ట్రాల్లో యువత మళ్లీ వామపక్షాల వైపు రావడం ఆశను కలిగిస్తోంది. ఈ అరాచక వ్యవస్థ అనే బుడగ ఎప్పుడో ఒకప్పుడు పేలక తప్పదు. అది పేలిన రోజు కొత్త తరం నుండి ఒక గొప్ప విప్లవం పుట్టుకొస్తుంది. ఆ రోజు కోసం సామాజిక శక్తులు క్షేత్రస్థాయిలో పని చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -