– బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు గాలి, నీరు సహా అన్నీ ప్రయివేటీకరణ
– మహిళలపై ఆరెస్సెస్, బీజేపీ దాడులు : మీడియా సమావేశంలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందరరామన్
– ఎస్సీ, ఎస్టీ, మహిళల పోరాటాలకు ఐద్వా అండ : ఎస్.పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘బీజేపీ పాలనలో దేశంలోని మహిళలు, పేదలు, కార్మికులు తమ జీవించే హక్కును సైతం కోల్పోతున్నారు. వారిపై అటు భౌతికంగాను, ఇటు విధానాల పరంగానూ దాడులు పెరిగిపోతు న్నాయి. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కు కోసం మా సంఘం తరపున ఉధృత పోరాటాలు నిర్వహిస్తాం…’ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఉపాధ్యక్షులు సుధా సుందర రామన్ ఉద్ఘాటించారు. మనిషి జీవించేందుకు అవస రమైన గాలిని, నీటిని సైతం ప్రయివేటుపరం చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. ఐద్వా అఖిల భారత 14వ మహాసభల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధా సుందరరామన్ మాట్లాడారు. 1981లో ఆవిర్భవించిన ఐద్వా దేశవ్యాప్తంగా 1.6 కోట్ల సభ్యత్వంతో దేశంలోని 26 రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తోందని గుర్తుచేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మహిళలపై దాడులను తీవ్రతరం చేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని నిరూపించుకోలేని విధంగా డాక్యుమెంట్లను సమర్పించాలని కోరుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్ పేరుతో బీహార్‌లో ఎన్నికలకు ముందు 65 లక్షల మంది ఓట్లను తొలగిస్తే అందులో 45 లక్షల మందికి పైగా మహిళలున్నారని ఆమె తెలిపారు. ఇందులోనూ బతుకుదెరువు కోసం వలస వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ వారి ఓటు హక్కును తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు సమర్పించాలంటూ మహిళలను వేధిస్తున్నారని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావం మహిళలను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నదని ఆమె ఈ సందర్భంగా వాపోయారు. ప్రకృతి విపత్తుల కారణంగా అనేకసార్లు మహిళలకు నివసించేందుకు చోటు కూడా లభించని పరిస్థితి నెలకొందని చెప్పారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల కోసం అనేక రాష్ట్రాల్లో అడవులను నరికేస్తుంటే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవించి వరదలు తదితర ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయని తెలిపారు. దీంతో స్వచ్ఛమైన గాలి, తాగునీరు కోసం కూడా అల్లాడే పరిస్థితులు దాపురిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. అన్ని సహజ వనరులను ప్రయివేటీకరిస్తున్నారని వివరించారు. విద్యను కాషాయీకరణ, ప్రయివేటీకరణతో బాలికలను చదువులకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలోనూ ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు.
వాతావరణ మార్పుల నుంచి మహిళలకు భద్రత కల్పించేందుకు కేరళ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పేర్కొంటూ సుధా సుందరరామన్ అక్కడి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారతకు కుటుంబశ్రీ పథకాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బతుకు కోసం, ఆత్మగౌరవం కోసం, మనువాదానికి వ్యతిరేకంగా, మానవ, మహిళల హక్కుల కోసం తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మహిళల బతుకులపై బీజేపీ దాడి చేస్తోందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవించడానికి ఆయా తరగతుల ప్రజానీకం చేస్తున్న పోరాటాలకు ఐద్వా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఐద్వా పాల్గొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్బీఐ, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు పావలా వడ్డీకి రుణాలిస్తే ఆయా కంపెనీలు మహిళలకు రూ.2 నుంచి రూ.10 వడ్డీకి అప్పులిచ్చి పీడిస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా ఐద్వా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. డ్రగ్స్, మద్యం, గంజాయి వంటి మత్తుపదార్థాలకు పరోక్షంగా మహిళలు బలవుతున్నారనీ, దీనికి వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరు జిల్లా డీవైఎఫ్‌ఐ నాయకుడు పెంచలయ్యను మాఫియా హత్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికీ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం ఐద్వా పోరాటాలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత, సౌకర్యాల లేమిపై సంఘం తరపున సర్వే చేసి వెలుగులోకి తెచ్చినట్టు చెప్పారు. మెరుగైన బతుకు కోసం మహిళలు సాగిస్తున్న పోరాటమే ఐద్వా పోరాటమన్నారు. మనువాద సంస్కృతిని ప్రతిఘటిస్తూ మహిళలను అగ్నికణాలుగా మారుస్తున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
అభయహస్తం పొదుపు డబ్బులివ్వాలి : మల్లు లక్ష్మి
అభయహస్తం పథకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలు పొదుపు చేసిన రూ.600 కోట్లను తిరిగి వారికివ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పథకాన్ని పునరుద్ధరిం చాలని ఆమె కోరారు. 85 శాతం మంది మహిళలకు ఉపాధినిస్తున్న నరేగా పథకాన్ని పునరుద్ధరిం చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల నిధులు కేంద్రానికి వెళుతున్న నేపథ్యంలో రాష్ట్రాల వాటాతో ముడిపెడుతూ తెచ్చిన వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో మహిళలు పని హక్కు కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇండ్ల హక్కుల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగిపో యాయని మల్లు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. 19 ఏండ్ల నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన 57.6 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని తెలిపారు. హత్రాస్, ఉన్నావో, బిల్కిస్ బానో, జాతీయ రెజ్లర్ తదితర ఘటనల్లో బీజేపీ నాయకులు, ఎన్నికైన ప్రజా ప్రతి నిధుల తీరు పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో ఐద్వా పోరాట ఫలితంగా 250 మందికి ఇండ్ల పట్టాలు దక్కాయని గుర్తు చేశారు. ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి తదితరుల స్ఫూర్తితో భవిష్యత్తులో మహిళా హక్కుల కోసం ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.
పలు పుస్తకాల ఆవిష్కరణ
ఐద్వా మహాసభలో ప్రధాన వేదికపై అగ్రనేతలు పలు పుస్తకాలను ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో సుధా సుందరరామన్, పుణ్యవతి, అర్చనా ప్రసాద్, మల్లు లక్ష్మి వాటి గురించి వివరించారు. 1) మహిళల పెరుగుతున్న రుణభారం, ఎంఎఫ్‌ఐ దోపిడీ, దేశవ్యాప్త సర్వే, జాతీయ ప్రజా విచారణ నివేదిక 2) గీనా కుమారి రాసిన సుశీలా గోపాలన్ జీవితం, 3) మహిళల జీవితాలను మార్చడం, వామపక్ష ప్రత్యామ్నాయం-కేరళ కథ (ఏఐడీడబ్ల్యూఏ కేరళ రాష్ట్ర కమిటీ ద్వారా) 4) ఏఐడీడబ్ల్యూఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ద్వారా ఆంధ్ర మహిళా సంఘం మొదటి రాష్ట్ర మహాసభ నివేదిక ఆంగ్ల అనువాదం 5) సుభాషిణి అలీ రాసిన సామాజిక సంస్కరణ యాత్ర కోసం సీఈసీ బుక్‌లెట్ తెలుగు అనువాదం 6) ఎస్. పుణ్యవతి రాసిన తెలుగు వ్యాసాల సంకలనం, 7) ఏఐడీడబ్ల్యూఏ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ద్వారా తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రపై బుక్‌లెట్ (పి. సుందరయ్య పుస్తకం నుంచి ఒక అధ్యాయం) అనే పుస్తకాలను మహాసభలో ఆవిష్కరించినట్టు వారు తెలిపారు.



