– 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులు
– ఫిబ్రవరి 11న ఒకే విడతలో ఎన్నికలు
– ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
– ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
– నేటి నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ
– 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక
– తక్షణమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు : షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డుల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని వివరించారు. నేటి నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. పోలింగ్‌లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్ నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారని వివరించారు. ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహిస్తారనీ, ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని చెప్పారు.
8,203 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వివరించారు. ఇందులో 25.62 మంది పురుష ఓటర్లు, 26.80 మంది మహిళా ఓటర్లు, 640 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణకు 16,031 బ్యాలెట్ బాక్స్‌లు, 137 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 136 లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. పోలింగ్ నిర్వహణకు 742 మంది జోనల్ అధికారులు, 279 ఎఫ్‌ఎస్‌టీ, 381 ఎస్‌ఎస్‌టీ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 1,547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 9,560 మంది పోలింగ్ ఆఫీసర్స్, 31,428 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు మొత్తం 45,316 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిం చేందుకు ఓటర్లు, పోటీచేసే అభ్యర్థులు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లందరూ పోలింగ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని రాణి కుముదిని పిలుపు నిచ్చారు.
ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవే..
కాల పరిమితి ముగియని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించడం లేదని పురపాలక శాఖ శాఖ డైరెక్టర్ టీకే. శ్రీదేవి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్ మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగడం లేదన్నారు. ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరుగుతున్నవాటితో పాటు రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు తెలిపారు. అయితే వాటిలో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతానికి మించకుండా నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు శ్రీదేవి తెలిపారు.
రూ.50 వేల వరకు నగదుకు అనుమతి లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్‌భగవత్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రూ.50 వేల వరకు మాత్రమే నగదు అనుమతి ఉందని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. అంతకంటే ఎక్కువ ఉంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉంచుకోవాలని కోరారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 25 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. సెన్సిటివ్, క్రిటికల్, కమ్యూనల్ సెన్సిటీవ్, సాధారణ పోలింగ్ స్టేషన్లును గుర్తించి నాలుగు విభాగాలుగా విభజించామన్నారు. కమ్యూనల్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలైన నిర్మల్, బైంసా, బోధన్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామపం చాయతీ ఎన్నికల సందర్భంగా 1,800 లైసెన్స్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామనీ, అర్బన్ ప్రాంతాల్లో ఉన్న వాటిని సైతం స్వాధీనం చేసుకుం టామని చెప్పారు. రౌడిషీటర్లు, ఎన్నికల నేరస్తులను బైండోవర్ చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వ హణకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ షెడ్యూల్
జనవరి 28 నుంచి 30వరకు నామినేషన్లు
జనవరి 31న పరిశీలన
ఫిబ్రవరి 3న ఉపసంహరణ అనంతరం తుది జాబితా..
ఫిబ్రవరి 11న ఒకే విడతలో పోలింగ్
రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న..
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు
16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక
అనివార్య కారణాలతో ఈ ఎన్నికలు ఎక్కడైనా జరగకుంటే ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు
మోగిన మున్సిపల్ నగారా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



