Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు : సీఎం

సమ్మక్క, సారలమ్మ జాతర శుభాకాంక్షలు : సీఎం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్బంగా రాష్ట్ర ప్రజలకు సీఎం ఏ రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణా కుంభమేళాగా పేరొందిన మేడారం మహా జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకుంటారనీ, దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు తరలి వచ్చే ఈ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మేడారం ఆలయాన్ని ప్రజా ప్రభుత్వం పునర్నిర్మించిందని గుర్తు చేశారు. రూ.250 కోట్లతో ఆలయ ప్రాకారం విస్తరణ, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలను విశాలంగా నిర్మించామన్నారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, ప్రాంగణానికి నలు దిశలా తోరణాలను నిర్మించామన్నారు. మేడారం తల్లుల స్పూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని వనదేవతల దీవెనలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మేడారంలో మంత్రి మండలి సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తిగా రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా నుంచి ఫోన్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకోవాలనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భక్తులు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -