– మాంసాహార జంతువుల ఉనికికి 994 ఆధారాలు
– 552 పెద్ద శాకాహార జంతువుల ఉనికికి సాక్ష్యాలు లభ్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో పులుల గణన సర్వే (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2026) విజయవంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు శాస్త్రీయ పద్ధతుల్లో ఈ సర్వే చేపట్టారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాను మినహాయించి, 32 జిల్లాల్లోని అన్ని బీట్లలో సర్వే పూర్తి చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా 15 కిలోమీటర్ల మేర కార్నివోర్ సైన్ సర్వే, రోజుకు 2 కిలోమీటర్ల ట్రాన్సెక్ట్ సర్వే నిర్వహించి అటవీ వక్షజాలం, ఆహార జంతువుల సాంద్రతను అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఎం- స్ట్రైప్స్ యాప్‌లో నమోదు చేసి, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రిమోట్ సర్వర్‌కు అప్లోడ్ చేశారు.ప్రాథమిక గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా పులులు, ఇతర మాంసాహార జంతువుల ఉనికికి సంబంధించి 994 ఆధారాలు లభించాయి. అలాగే 552 పెద్ద శాకాహార జంతువులకు సంబంధించిన ఆధారాలను అధికారులు గుర్తించారు. ఇతర వన్యప్రాణుల ఆనవాళ్లు కూడా పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. ఈ సర్వేలో 4,512 మంది అటవీ శాఖ సిబ్బందితో పాటు దేశ నలుమూలల నుంచి వచ్చిన 1,677 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. సర్వే సమయంలో కొన్ని విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. విధి నిర్వహణలో ఒక అటవీ వాచర్ గుండె పోటుతో మరణించగా, ఎలుగుబంటి దాడిలో ఒకరు గాయపడ్డారు. మరొక వాలంటీర్‌కు కాలు విరిగింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అటవీ సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పని చేసి సర్వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేశారు. వన్యప్రాణి సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఈ సర్వే ద్వారా వెల్లడైందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ముగిసిన పులుల గణన సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



