Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామాల చుట్టూ పులి సంచారం

గ్రామాల చుట్టూ పులి సంచారం

- Advertisement -

– అనవసరంగా బయటకు రావొద్దు : అటవీ శాఖ సూచనలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇటీవల మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పులి రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గ్రామాల సమీపంలో సంచరిస్తున్నది. పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పులి కదలికలు కనిపించడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. జాతీయ పులుల సంరక్షణ (ఎన్టీసీఎ) మార్గదర్శకాల మేరకు పులి సంచరించే సంబంధిత జిల్లా అటవీ అధికారులు 24 గంటల నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారనీ, దాని కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిసర గ్రామస్తులను ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. పశువులపై దాడులు జరిగిన ప్రాంతాల్లో జనాలు గుమిగూడకుండా అటవీ శాఖ జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటోంది. పోలీసుల సహకారంతో శాంతిభద్రతలు కాపాడుతూ, ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. గ్రామస్తులు అనవసరంగా బయట తిరగకుండా ఉండాలనీ, పులి సంచారం గురించి సమాచారం లభించిన వెంటనే సమీప అటవీ అధికారులకు తెలియజేయాలని అటవీ శాఖ కోరింది. వ్యవసాయ పొలాల్లో అక్రమ విద్యుత్‌ వైర్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. పులి గ్రామాల చుట్టుపక్కల సంచరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించలేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. పులి మానవులకు ముప్పు కాదనీ, మనుషులతో దూరంగా ఉండే స్వభావం కలిగినదని వెల్లడించింది. అవసరమైతే పులిని పట్టుకునేందుకు ట్రాప్‌ కేజ్‌లు సిద్ధంగా ఉన్నాయనీ, వన్యప్రాణి నిపుణులు, వెటర్నరీ బందాలు ఎప్పుడైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. రాత్రి వేళల్లో పులి కదలికలను గమనించేందుకు థర్మల్‌ డ్రోన్లను వినియోగించనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో పులుల సంచారాన్ని అటవీ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందనీ, ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా సహకరించాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -