నవతెలంగాణ – హైదరాబాద్: ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మృతి చెందారు. బారామతి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ సహా మొత్తం ఆరుగురు మరణించినట్టు సమాచారం.
పవార్ రాజకీయ ప్రమాణం
అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌ప వార్.. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏండ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.



