Sunday, May 25, 2025
Homeసోపతిఖమ్మం బాల కథా 'చంద్రిక'

ఖమ్మం బాల కథా ‘చంద్రిక’

- Advertisement -

నాకు తెలిసి పందొమ్మిది వందల ఎనభయ్యవ దశకంలో కామారెడ్డి ప్రాంతంలో బాల సాహితీవేత్త డా.వి.ఆర్‌. శర్మ బడి పిల్లల కార్యశాలలు జరిపి పుస్తకంగా తెచ్చాడు. ఆ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. తరువాత గరిపెల్లి అశోక్‌ మార్గదర్శనంలో 1997లో మారసం పక్షాన స్వర్ణభారతికి బాల భారతి కవితా నీరాజనం పేరు స్వతంత్ర భారత స్వర్ణోత్సవ కవి సమ్మేళనం జరిపి పుస్తకంగా తెచ్చారు. ఆనాడు అది ఒక చిన్న నీటి బిందువులాగా అనిపించింది. కానీ ఇప్పుడది ‘ఇంతింతై.. వటుడింతై… నభోవీధిపై నంతై…’ అన్నట్టు తెలుగు మాగాణమంతా రచనల సేద్యం జరుగుతోంది.
తెలంగాణంలో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న బాలల రచనల విప్లవం గురించి చెప్పడమంటే ఒక కొత్త చరిత్ర వ్రాయడమే. ఇందులో ఆదిలాబాద్‌ నుండి ఖమ్మం దాకా, కరీంనగర్‌ నుండి నల్లగొండ దాకా వందలాది మంది పాల్గొన్నారు.. పాల్గొంటూనే ఉన్నారు. అక్కడ ఇక్కడ, ఆ బడిలో, ఈ బడిలో అనికాదు, ఇవ్వాళ్ళ తెలంగాణ మంతా బాలల రచన తేజోమయమై వెలుగుతోంది. ప్రతి బడి కార్యశాలలకు గుడియై, శిల్పశాలల ఒడియై వర్ధిల్లుతోంది. అందులో భాగంగా ఖమ్మం గుమ్మం పైన కూడా ఈ జండా రెపరెపలాడుతోంది. దాదాపు డజనుకు పైగా బాల సాహిత్య వికాసకారులంతా ఈ జండాను ఖమ్మంలో మోస్తున్నారు. ఒకరి పేరు ప్రస్తావిస్తే మరొకరిని విస్మరించినట్టే… అందుకే ఈ సందర్భానికి చెందిన బాల సాహిత్యవికాసకారుడు కొండ్రు బ్రహ్మంను అభినందిస్తున్నాను.
బ్రహ్మం మార్గదర్శనంలో కథా సేద్యాన్ని చేసింది బాల రచయిత్రి చిరంజీవి కొల్లి చంద్రిక. ఈ అమ్మాయి 4 జూలై, 2020న ఖమ్మంలో పుట్టింది. ఈ చిరంజీవి తల్లితండ్రులు శ్రీమతి కొల్లి లక్ష్మి-శ్రీ కొల్లి సదానందం. ఖమ్మం ఎన్‌.ఎస్‌.సి.కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివింది చంద్రిక. తొమ్మిదవ తరగతి విద్యార్థినిగా ఉన్నప్పుడే ఈమె వ్రాసిన కథలు పుస్తకంగా వచ్చాయి. దీనికి వదాన్యత పంచి ప్రచురించింది ఈ అమ్మాయికి చదువు చెప్పిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కావడం విశేషం. ఒక్కడ ఇంకో విషయం చెప్పాలి… గతంలో ఈ పాఠశాల నుండి వందమంది చిన్నారుల రచనలతో ‘తొలిజల్లు’ కవితా గేయ సంకలనం వెలువడింది. ‘పున్నాగపూలు’ పేరుతో కథా సంకలనం కూడా వచ్చింది.
మనం అనేకసార్లు చదివి వుంటాం… విమర్శకులు, కథకులు కథా సాహిత్యాన్ని గురించి పేర్కొంటూ ‘కథ జీవితానికి అచ్చమైన ప్రతి బింబం’గా ఉంటుంది అని చెప్పడం. అది చిరంజీవి చంద్రిక విషయంలో అచ్చంగా సరిపోతుంది. తనకున్న పది పన్నెండేండ్ల లేత అనుభవంలో తాను చూసినవి, అనుభవించినవి, విన్నవి క్రోడీకరించి ముప్పైఒక్క రంగుల బాల ఇంద్రధనుస్సుగా తన ‘కథా చంద్రిక’ను మలిచిందీ బాల రచయిత్రి. ఇందులోని ‘కష్టం’ కథలోని కష్టమంతా రచయిత్రి కుటుంబానికి సంబంధించిందే! తన తల్లితండ్రులకు ప్రమాదం జరగగా అందులో ఈ చిన్నారి తన తల్లితండ్రులను కోల్పోయింది. దానినే కథగా మలిచింది. ఇది కన్నీళ్ళు పెట్టించే కథ. ఈ రచయిత్రి కథలకు ప్లే గ్రౌండ్‌ ఇల్లు, బడి, దోస్తులు, తాను చూసిన సంఘటనలు కావడం వల్ల ప్రతి కథ చక్కగా వచ్చింది. నేను పైన చెప్పాను కదా… తొలి కథ ‘అసూయ’ బడి కథనే. హరి, కృష్ణ ఇద్దరు క్లాస్‌మెట్స్‌. హరి చక్కగా చదువుతూ, ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రతి హౌంవర్క్‌ను పూర్తి చేస్తాడు. అది చేతకాని కృష్ణ వాటిని దొంగలించి దాచివేస్తాడు. సరే! అన్ని కథల్లోలాగే కృష్ణ చివరకు తన తప్పును తెలుసుకుని మారిపోతాడు. తరగతి గదిలో తాను చూసిన విషయాన్ని వ్రాయడం బాగుంది. ‘కృప’ కథ అవయవదానం, సేవా గుణం గురించి చెప్పిన కథ. అవయవ దానం ఆవశ్యకతను ఈ చిన్నారి చెప్పడం బాగుంది. అపార అనుభవం సొంతమైన వారిలాగా విస్తృత వైవిధ్యం, అంశాలతో ఈ అమ్మాయి వ్రాయడం ఆశ్చర్యం… ఆనందాన్ని కలిగిస్తుంది. ఆశీస్సులందిస్తూ… ప్రముఖకవి మువ్వా శ్రీనివాస రావు ”ఈ కథల వెనుక ముద్దుగా మెరుస్తున్న అమాయకత్వం, భావుకత, సరళత, జీవితం పట్ల ఒక నూతన దృక్పథం కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా కథనం సరళంగా ఉండి లోతైన అర్థం ఉండేలా రచయిత్రి తన రచనా శైలిని తీర్చిదిద్దింది” అంటారు… నిజం అన్నా!
‘కుందేలు చాకచక్యం’ మరో మంచి కథ. ఆపదలు వచ్చినప్పుడు భయంతో కాకుండా సమయస్ఫూర్తితో ఆలోచించినప్పుడు వాటిని ఎలా అదిగమించవచ్చో చెబుతుంది. నాకు బాగా నచ్చిన కథ ఇందులోని ‘ప్రభావం’ కథ. తనకు నచ్చిన హీరో అల్లు అర్జున్‌కు సంబంధించిన అభిమాని కథ. ఇందులో ఈ చిన్నారి సినిమాలు చూసి మనం గుడ్డిగా అనుసరించవద్దని, మంచిని మాత్రమే మనం తీసుకోవాలని చెబుతుంది. దీనిని ఈ తరం గ్రహిస్తే ఎంత బాగుంటుందో! ‘స్వచ్ఛమైన ప్రేమ’ను గురించిన ఒక కథ ఉంది. మరో కథ ‘విశ్వాసం’.. జంతువులు, వాటిపట్ల ప్రేమను అవి మనపట్ల చూపించే విశ్వాసంను గురించి ఈ కథ చెప్పగా, ‘మార్గదర్శకుడు’, ‘పాపం’ వంటివి చదివింపజేసే మరికొన్ని మంచి కథలు. ‘డబ్బు పిచ్చి’ కూడా ఇటువంటి కథే! తన తొలి అడుగులోనే యాబైకి పైగా కథలు వ్రాసి, వాటిలోంచి ముప్పైకథలతో ‘కథా చంద్రిక’ ఖమ్మం సాహితీ గుమ్మంలో పున్నమి చంద్రమలాగా మెరుస్తున్న చిన్నారి చంద్రికకు ఆశీస్సులు. తన కథలకు ముద్దులు… ప్రేరణై నిలిచిన సోదరుడు కొండ్రు బ్రహ్మంకు జేజేలు! చిన్నారి కథలను ఒడిసిపట్టి వయ్యిగా తెచ్చిన టీచర్లకు నమస్సులు! ఇది కదా మనకు కావాల్సింది… ! జయహౌ! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌ 9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -