టాప్‌లోనే అభిషేక్ శర్మ
ఐసిసి టి20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టి20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 5 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలతో రాణించడంతో సూర్యకుమార్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని ఏకంగా 7వ స్థానంలో నిలిచాడు. ఇక అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు దూరమైన హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా 3వ స్థానంలోనే ఉన్నాడు.
ఇక రాయ్ పూర్ వేదికగా జరిగిన 2వ టి20లో కేవలం 32 బంతుల్లోనే 76పరుగులతో రాణించిన ఇషాన్ కిషన్ బ్యాటర్ల జాబితాలో 64వ స్థానంలో నిలువగా.. శివమ్ దూబే 9 స్థానాలు మెరుగుపరుచుకొని 58వ ర్యాంక్‌లో నిలిచాడు. టి20 స్పెషలిస్ట్ బ్యాటర్ రింకు సింగ్ 13 స్థానాలు ఎగబాకి 68వ స్థానంలో ఉన్నాడు. ఇక టి20 బౌలర్ల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముజీబుర్ రెహ్మాన్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలువగా.. బుమ్రా నాలుగు స్థానాలు ఎగబాకి 13వ, బిష్ణోయ్ 13స్థానాలు ఎగబాకి 19వ స్థానంలో నిలిచారు. ఇక భారతజట్టు 273రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలువగా.. ఆస్ట్రేలియా(267), ఇంగ్లండ్(258) టాప్-3లో ఉన్నాయి.



