Thursday, January 29, 2026
E-PAPER
Homeఆటలువిశాఖలో టీమిండియాకు నిరాశ

విశాఖలో టీమిండియాకు నిరాశ

- Advertisement -

నాల్గో టి20లో న్యూజిలాండ్‌ గెలుపు
కదం తొక్కిన సీఫర్ట్‌, కాన్వే

విశాఖపట్నం: వరుసగా మూడు టి20ల్లో నెగ్గిన టీమిండియా.. నాలుగో టి20లో నిరాశపరిచింది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో న్యూజిలాండ్‌ చేతిలో 50పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత భారత బౌలర్ల పేలవ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోర్‌ నమోదు చేయగా.. ఛేదనలో భాగంగా టీమిండియా 18.4ఓవర్లలో 165పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ బౌలర్లు సాంట్నర్‌కు మూడు, ఇష్‌ సోథీ, డఫీకి రెండేసి వికెట్లతో రాణించగా.. భారత బ్యాటర్లలో శివమ్‌ దూబే(65), రింకు సింగ్‌(39), సంజు శాంసన్‌(24) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో ఐదు టి20ల సిరీస్‌లో భారతజట్టు 3-1తో ఆధిక్యతలో నిలిచింది. ఐదో, చివరి టి20 తిరువనంతపురం వేదికగా శనివారం జరగనుంది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు సీఫర్ట్‌, కాన్వే ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. వీరిద్దరూ బ్యాటింగ్‌లో రాణించి కేవలం 8.2ఓవర్లలోనే 100 పరుగులు చేశారు. టిమ్‌ సీఫర్ట్‌ (62; 36బంతుల్లో, 7ఫోర్లు, 3సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (44; 23బంతుల్లో, 4ఫోర్లు, 3సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఆ తర్వాత గ్లెన్‌ ఫిలిప్స్‌ (24; 16బంతుల్లో, 3ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో డారిల్‌ మిచెల్‌ (39 నాటౌట్‌; 18 బంతుల్లో, 2ఫోర్లు, 3సిక్సర్లు) చెలరేగడంతో న్యూజిలాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సీఫర్ట్‌ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి, టి20ల్లో భారత్‌పై వేగంగా సెంచరీ చేసిన న్యూజిలాండ్‌ ఆటగాడిగా రాస్‌ టేలర్‌, కేన్‌ విలియమ్సన్‌ సరసన చేరాడు.

ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్‌ మధ్యలో కాస్త తడబడింది. రచిన్‌ రవీంద్ర(2), మార్క్‌ చాప్‌మన్‌(9) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ ఆ తర్వాత స్కోర్‌బోర్డును పరుగెత్తించాడు. చివర్లో డారిల్‌ మిచెల్‌ బ్యాట్‌ ఝులిపించడంతో న్యూజిలాండ్‌ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్‌(11), ఫౌల్క్స్‌(13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్‌ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్‌ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/33), కుల్దీప్‌ యాదవ్‌ (2/39), బుమ్రా (1/38) కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే చేజిక్కించుకుంది.

స్కోర్‌బోర్డు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి)రింకు సింగ్‌ (బి)కుల్దీప్‌ 44, షెఫర్ట్‌ (సి)రింకు సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 62, రచిన్‌ రవీంద్ర (సి అండ్‌ బి)బుమ్రా 2, ఫిలిప్స్‌ (సి)రింకు సింగ్‌ (బి)కుల్దీప్‌ 24, ఛాప్మన్‌ (సి)హర్షిత్‌ రాణా (బి)బిష్ణోయ్ 9, మిఛెల్‌ (నాటౌట్‌) 39, సాంట్నర్‌ (రనౌట్‌) హార్దిక్‌ 11, ఫోక్స్‌ (సి)రింకు సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 13, హెన్రీ (నాటౌట్‌) 6, అదనం 5 (20ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 215పరుగులు.
వికెట్ల పతనం: 1/100, 2/103, 3/126, 4/152, 6/163, 7/182
బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-33-2, హర్షిత్‌ రాణా 4-0-54-0, బుమ్రా 4-0-38-1, బిష్ణోరు 4-0-49-1, కుల్దీప్‌ 4-0-39-2.
ఇండియా ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి)కాన్వే (బి)హెన్రీ 0, సంజు శాంసన్‌ (బి)సాంట్నర్‌ 24, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి అండ్‌ బి)డఫీ 8, రింకు సింగ్‌ (ఎల్‌బి)ఫోల్కేస్‌ 39, హార్దిక్‌ పాండ్యా (సి)ఫోల్కెస్‌ (బి)సాంట్నర్‌ 2, దూబే (రనౌట్‌)హెన్రీ 65, హర్షిత్‌ రాణా (సి)రచిన్‌ రవీంద్ర (బి)ఇష్‌ సోధీ 9, రవి బిష్ణోయ్ (నాటౌట్‌) 10, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ (సి)సాంట్నర్‌ (బి)ఇష్‌ సోధీ 0, బుమ్రా (సి)ఇష్‌ సోధీ (బి)సాంట్నర్‌ 4, కుల్దీప్‌ (సి)సీఫెర్ట్‌ (బి)డఫీ 1, అదనం 3. (18.4ఓవర్లలో ఆలౌట్‌) 165పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/9, 3/55, 4/63, 5/82, 6/145, 7/157, 8/157, 9/162, 10/165
బౌలింగ్‌: హెన్రీ 3-0-24-1, డఫీ 3.4-0-33-2, ఫెల్కస్‌ 3-0-29-1, ఇష్‌ సోథీ 4-0-46-2, సాంట్నర్‌ 4-0-26-3, ఫిలిప్స్‌ 1-0-7-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -