ఎయిర్‌పోర్ట్‌లను 350కి పెంచడమే లక్ష్యం
విమానాల తయారీలో స్వయం సమృద్ధి సాధిస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
ఘనంగా వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభం
నవ తెలంగాణ – బిజినెస్ డెస్క్
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భారత్ అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పౌర విమానయాన ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా 2026’ను మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం లాంచనంగా ప్రారంభించారు. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-9 విమానాన్ని ఆవిష్కరించారు. జనవరి 31 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో అత్యాధునిక సాంకేతికతలు, ఎయిర్ షోలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సందర్బంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈ నాలుగో ఎడిషన్ భారత విమానయాన శక్తిని ప్రపంచానికి చాటుతుందని తెలిపారు.
దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. రాబోయే పదేండ్లలో భారతదేశాన్ని విమాన తయారీ రంగంలో స్వయంసమృద్దిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకుందన్నారు. మరో 10 నుంచి 12 ఏండ్లలో పౌర విమానయాన రంగంలో భారత్ ప్రపంచానికే ఎగుమతిదారుగా ఎదిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల డెలివరీలో ప్రస్తుతం ఎదురవుతున్న అడ్డంకులు తొలగి, కొత్త విమానాల రాకతో దేశీయ విమానయాన రంగానికి భారీ మద్దతు లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
గతంలో విమాన ప్రయాణం ఒక విలాసంగా ఉండేదని ఇప్పుడది సామాన్యుడికి గౌరవప్రదమైన అవసరంగా మారిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా మారుమూల ప్రాంతాలకు విమాన సేవలను విస్తరించడమే కాకుండా, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం నిర్మితమయ్యేలా వేగంగా మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని వెల్లడించారు. భారత్‌ను కేవలం విమానాల వినియోగదారుగానే కాకుండా, విమాన విడిభాగాలు, విమానాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ అసలు లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే 20 ఏండ్లలో వేలాది కొత్త విమానాల అవసరం ఉంటుందని, ఆ దిశగా విమానాల నిర్వహణ, లీజింగ్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విమానయాన రంగంలో మహిళా పైలట్ల సంఖ్యను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచుతామన్నారు.
20కి పైగా దేశాలు..
నాలుగు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో 20కి పైగా దేశాల నుండి సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా ఎయిర్ షోలు, అత్యాధునిక విమానాల ప్రదర్శనలు, సిఇఒ రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఏవియేషన్ జాబ్ ఫెయిర్‌ను కూడా నిర్వహిస్తున్నారు. జనవరి 30, 31 తేదిల్లో సాధారణ సందర్శకులను అనుమతించనున్నారు. దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
అలరించిన విన్యాసాలు..
భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్, బ్రిటన్‌కు చెందిన మార్క్ జెఫరీస్ బృందం అద్భుతమైన విన్యాసాలతో హైదరాబాద్ ఆకాశాన్ని రంగులమయం చేశాయి. ఎయిర్‌షో నిర్వహించే ప్రతీ రోజు నిర్వహించే ఈ విన్యాసాలు చూపరులను మంత్రముగ్దులను చేస్తన్నాయి.



