Thursday, January 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమేడారం.. జనసంద్రం

మేడారం.. జనసంద్రం

- Advertisement -

ఘనంగా మహాజాతర ప్రారంభం
కొలువు తీరిన సారలమ్మ
పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
గద్దెలకు చేరిన పగిడిద్దరాజు, గోవిందరాజు
నేడు సమ్మక్క రాక..
పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు


నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మేడారం.. జనసంద్రమైంది. రెండేండ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది సందర్శకులు పోటెత్తారు. జయజయ ధ్వానాల నడుమ, డోలు వాయిద్యాలు, ఆదివాసీ యువతుల నృత్యాలు, మహిళల పొర్లుదండాల మధ్య కాక కిరణ్‌ కొమ్ము ఊదుతూ ముందుకు సాగగా.. సారలమ్మను ప్రధాన వడ్డె కాక సారయ్య గద్దెలపై ప్రతిష్టించారు. బుధ వారం సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం ముగిసింది. గురువారం సాయంత్రం సమ్మక్క రాక కోసం భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ యువతులు నీటితో కడిగి ముగ్గులు వేసి ప్రత్యేక పూజలు జరిపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్‌ దివాకర, ఐటిడిఎ పీవో చిత్రా మిశ్రా, అధికారులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

ప్రధాన పూజారి కాక సారయ్య సారలమ్మను తీసుకొని వస్తుండగా, దారికి అడ్డంగా నినాదాలు చేస్తూ.. పొర్లు దండాలు చేస్తూ స్వాగతం పలికారు. సారలమ్మను తీసు కొస్తున్న వడ్డె కాక సారయ్య గద్దెలకు చేరుకోవడానికి పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు డీఎస్పీ రవీందర్‌ నాయకత్వంలో రోప్‌ పార్టీని ఏర్పాటు చేసి వడ్డెలు సురక్షితం గా గద్దెల వద్దకు రావడానికి కీలకంగా మారారు. ఆదివాసీ సంఘాల వాలంటీర్లు, తుడుందెబ్బ కార్యకర్తలు వడ్డెలకు రక్షణ కవచంగా నిలిచి కన్నెపల్లి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వరకు ముందుకు సాగారు. ప్రధాన పూజారి కాక సారయ్య, ఇతర పూజారులు సారలమ్మను గద్దెపైకి ప్రతిష్టించిన అనంతరం మంత్రి సీతక్క, కలెక్టర్‌ దివాకర, అధికారులు పూజలు నిర్వహించారు.

కొలువుతీరిన పగిడిద్దరాజు
మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు సమ్మక్క భర్త పగిడిద్దరాజును గద్దెపై ప్రతిష్టించారు. మంగళవారమే పూనుగొండ్ల నుంచి పెనక వంశీయులు పగిడె రూపంలో వున్న పగిడిద్దరాజును తీసుకొని కాలినడకన బయలుదేరి రాత్రి గోవిందరావుపేట మండలంలోని లక్ష్మీపురంలో బస చేశారు. బుధవారం మళ్లీ కాలినడకన బయలుదేరి సాయంత్రానికి మేడారం గద్దెలకు చేరుకొని పడిగె రూపంలో వున్న పగిడిద్దరాజును ప్రతిష్టింపజేశారు.

గోవిందరాజుల ప్రతిష్ట
ములుగు జిల్లాలోని ఏటూర్‌నాగారం మండలం కొండాయి నుంచి ప్రధాన వడ్డె పోదెం బాబురావు, ఇతర పూజారులు పడిగె రూపంలోని గోవిందరాజును తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు.

నేడు సమ్మక్క రాక
సారలమ్మ గద్దెలపై కొలువుతీరడంతో మేడారం జాతర ప్రారంభం కాగా, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య తీసుకురానున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం, సమ్మక్క పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం రోప్‌ పార్టీ చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి రిహార్సల్స్‌ నిర్వహించారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్‌ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ములుగు డిఎస్పీ రవీందర్‌ ఆధ్వర్యంలో రోప్‌ పార్టీతో వడ్డెల ను సురక్షితంగా జంపన్నవాగు మీదుగా గద్దెల వరకు తీసుకొచ్చారు.

ఇంత అభివృద్ధి ఎన్నడూ చూడలేదు
20ఏండ్లుగా మేడారానికి వస్తున్నాం. మాది జయ శంకర్‌ -భూపాలపల్లి జిల్లా. ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. మహా అద్భుతంగా తీర్చిదిద్దారు. మంత్రి సీతక్క అహర్నిషలూ కృషి చేసిన ఫలితమే. జంపన్న వాగు వద్ద కూడా అన్ని సౌకర్యాలూ కల్పించారు. -ఉమేష్‌, భూపాలపల్లి జిల్లా

ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది
హైదరాబాద్‌ ధూల్‌పేట నుంచి వచ్చాను. ఒకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. రోడ్లు బాగా లేకపోతుండే. వాష్‌రూమ్స్‌కు ఇబ్బంది ఉంటుండే. ఈసారి మరుగుదొడ్లు, డ్రెస్సింగ్‌ రూమ్‌ సౌకర్యాలు బాగున్నాయి. రోడ్ల వెడల్పుతో పాటు వైద్య సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి. -శ్రావణి, హైదరాబాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -