ఆహార భద్రతపై దృష్టి పెట్టాలి
జీవ ఎరువులకు విధానపరమైన మద్దతు కావాలి
తగ్గుతున్న రైతుల ఆదాయాలు.. పెరుగుతున్న పన్నులు
పరిశోధనాభివృద్ధిపై తక్కువ ఖర్చు
ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే భారత్ వెనుకంజ
పెస్టిసైడ్లపై అధిక జీఎస్టీ రైతులకు మరో భారం
బడ్జెట్‌లో వ్యవసాయ రంగ సమస్యలకు మార్గం చూపాలి
రైతులు, పరిశ్రమల వర్గాలు
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కు సమయం సమీపిస్తున్నది. ఈ తరుణంలో పలు రంగాలనుంచి అనేక డిమాండ్లు, సూచనలు వినిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యసాయం, పోషణ, ఎరువుల రంగాలకు చెందిన పరిశ్రమల నిపుణులు, రైతులు కూడా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూనే పలు సూచనలు చేస్తున్నారు. వ్యవసాయ రంగం విషయంలో తాత్కాలిక ఉత్పత్తి పెంపుపై మాత్రమే కాకుండా.. దీర్ఘకాలిక స్థిరత్వం, పోషక భద్రత, ఆహార భద్రతపై దృష్టి పెట్టే విధానాలు అవసరం అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
హామీలకు విరుద్ధంగా మోడీ సర్కారు తీరు
తాత్కాలిక ఉత్పత్తి గణాంకాల పెంపును అభివృద్ధిగా చూపిస్తున్న మోడీ ప్రభుత్వం.. భారత వ్యవసాయం రంగంలో ఉన్న మౌలిక సమస్యలను పక్కన పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థిరమైన వ్యవసాయం, పోషక భద్రత, పరిశోధన-అభివృద్ధి వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక దృష్టి లేకపోవడం వల్ల రైతులు, వినియోగదారులు.. ఇద్దరూ నష్టపోతున్నారని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎరువులు, పెస్టిసైడ్లపై అధిక జీఎస్టీ భారాన్ని కొనసాగించడం, మరోవైపు రైతుల ఆదాయాలు స్థిరంగా పడిపోతున్న పరిస్థితి ప్రభుత్వ విధానాల అసమతుల్యతను స్పష్టంగా చూపుతోందని అంటున్నారు.
వ్యవసాయాన్ని ‘వృద్ధి ఇంజిన్’గా ప్రచారం చేసినప్పటికీ.. పరిశోధనాభివృద్ధిపై 0.7 శాతమే ఖర్చు చేయడం ప్రభుత్వ హామీలకు విరుద్ధంగా ఉందని విమర్శకులు అంటున్నారు. దేశీయ తయారీని ప్రోత్సహిస్తామంటూ చెప్తున్నా… జీవ ఎరువులు, బయో పెస్టిసైడ్ల వంటి రంగాలను ఇంకా పూర్తిస్థాయిలో ప్రోత్సాహక విధానాల్లోకి తీసుకురాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రచార గణాంకాలకే పరిమితం చేసి, స్థిరత్వం, పోషణ, శాస్త్రీయ ఆవిష్కరణల వంటి భవిష్యత్తు అవసరాలను విస్మరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
పోషకాహార లోపాన్ని నివారించే చర్యలు చేపట్టాలి
బెటర్ న్యూట్రీషన్ సహ వ్యవస్థాపకులు ప్రతీక్ రస్తోగి మాట్లాడుతూ… భారత్‌లో పోషకాహార లోపం, దాగి ఉన్న ఆకలి వంటివి పెద్ద సమస్యలుగా ఉన్నాయన్నారు. ”దేశంలో ఆహారం ఉంది. కానీ అవసరమైన పోషకాలు రోజువారీ ఆహారంలో లేవు” అని ఆయన చెప్పారు. ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషక లోపాలను నివారించేందుకు బయోఫోర్టిఫైడ్ విత్తనాలు, పోషక కేంద్రిత వ్యవసాయాన్ని జాతీయ విధానంగా మార్చాలని సూచించారు. ఇలా చేస్తే ప్రజారోగ్యం మెరుగవడంతో పాటు రైతులకు కూడా మంచి ధరలు లభిస్తాయని అన్నారు.
బడ్జెట్ ప్రకటనలకే పరిమితం కావద్దు
బడ్జెట్ 2026 అనేకది ప్రకటనలకే పరిమితం కాకుండా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందించేలా అమలు కావాలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. సరైన ప్రోత్సాహకాలు, పరిశోధనకు మద్దతు, స్థిరమైన వ్యవసాయ విధానాల ద్వారా భారత వ్యవసాయం మరింత ఆరోగ్యకరంగా, బలంగా, భవిష్యత్తుకు సిద్ధంగా మారుతుందని విశ్వసిస్తున్నాయి.
ఎరువుల రంగానికి సమతుల్య విధానాలు అవసరం
ట్రేడ్‌లింగ్ ఇంటర్నేషనల్ సంస్థ చైర్మెన్ అభిషేక్ వాడేకర్ మాట్లాడుతూ… ఎరువుల రంగంలో ధరలు అందుబాటు, సరఫరా, సాంకేతిక ఆధునీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దిగుమతి సుంకాల్లో సమతుల్యం, మౌలిక సదుపాయాల మెరుగుదల, స్థిరమైన సాంకేతికతలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ప్రపంచ సరఫరా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
పరిశోధన, అభివృద్ధిపై ఖర్చు పెంచాలి
ధనుకా అగ్రిటెక్ చైర్మెన్ డాక్టర్ ఆర్.జి ఆగర్వాల్ మాట్లాడుతూ… భారత్ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై 0.7 శాతం మాత్రమే ఖర్చు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చైనా, అమెరికా వంటి దేశాల కంటే చాలా తక్కువని చెప్పారు. ప్రయివేటు రంగ పరిశోధనకు పన్ను ప్రోత్సాహకాలు తిరిగి తీసుకురావాలనీ, ప్రభుత్వ-పరిశ్రమ పరిశోధనకు నిధులు పెంచాలని సూచించారు. అలాగే, పెస్టిసైడ్లపై 18 శాతం జీఎస్టీ అన్యాయమనీ, అవి రైతులకు అవసరమైన ‘పంట ఔషధాలు’ అని వివరించారు. వాటిపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
జీవ ఎరువులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అవసరం
కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఈ సందర్భంలో ఈ రంగానికి చెందిన పలువురు నిపుణుల అభిప్రాయాల ప్రకారం… రాబోయే బడ్జెట్ కీలకమైంది. ఇది దేశీయ తయారీని బలోపేతం చేయడానికి, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడానికి, రైతుల, వినియోగదారులకు లాభదాయకమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడానికి ఒక కీలక అవకాశం. ఐపీఎల్ బయోలాజికల్స్ అధ్యక్షుడు హర్షవర్ధన్ భాగ్‌చంద్కా మాట్లాడుతూ… బయో పెస్టిసైడ్లపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం స్థిరమైన వ్యవసాయానికి దోహదపడే కీలక నిర్ణయమని అన్నారు. బడ్జెట్ 2026లో జీవ ఎరువులు, జీవ ఉత్పత్తుల వినియోగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ఇది రసాయన ఎరువుల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీ భారం కూడా తగ్గిస్తుందని చెప్పారు. అలాగే బయోలాజికల్ ఎరువల పరిశ్రమను ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకంలో చేర్చాలని ఆయన సూచించారు.



