Thursday, January 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చివేత

ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చివేత

- Advertisement -

భారీ పోలీసు బందోబస్తుతో దౌర్జన్యం
కట్టుబట్టలతో రోడ్డుపై బాధితులు
సీపీఐ(ఎం) నాయకులపై నిర్బంధం.. అరెస్ట్‌
మంత్రి తుమ్మల హామీ నీటి మీద రాతేనా..?


నవతెలంగాణ-గాంధీ చౌక్‌
ఖమ్మం నగరంలో రోడ్డు విస్తరణ పేదలను నిరాశ్రయులను చేస్తోంది. పేద ప్రజల ఇండ్లను తొలగించి వారిని రోడ్డుపాలు చేస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీగా పోలీసు బందోబస్తు మధ్య బుధవారం ఇండ్లను కూల్చేశారు. అడ్డుకున్న స్థానికులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పేదలకు అండగా నిలుస్తున్న సీపీఐ(ఎం) నాయకులపై నిర్బంధం ప్రయోగించారు. హౌస్‌ అరెస్టు చేశారు. నగరంలోని త్రీ టౌన్‌ ప్రాంతంలో గల ప్రకాశ్‌నగర్‌ రోడ్డు విస్తరణ అవసరం లేకపోయినా కార్పొరేటర్ల భర్తలు కమీషన్ల కోసమే దీనిని చేయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాభీష్టం మేరకే రోడ్డు విస్తరణ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చినా, పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేటర్ల భర్తలు మంత్రి హామీని సైతం లెక్కచేయడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఖమ్మం నగరంలోని 17, 28, 29, 30, 31 డివిజన్లలో గల సుందరయ్య నగర్‌, శ్రీనివాస నగర్‌, ప్రకాశ్‌ నగర్‌, పంపింగ్‌ వెల్‌ రోడ్‌ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే, ప్రస్తుతం వున్న 30 అడుగుల రోడ్డు ఈ ప్రాంతాల్లో సరిపోతుందని, మట్టి రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మిస్తే సరిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు చెబుతున్నట్టు 100, 70, 80 అడుగుల రోడ్డు అవసరం లేదంటున్నారు. అయినప్పటికీ బుధవారం 28వ డివిజన్‌ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌ ప్రాంతంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసు బందోబస్తు మధ్య ఇండ్లను కూల్చేశారు. అడ్డుకున్న స్థానికులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ప్రజలను ఈడ్చుకెళ్లి పోలీస్‌ వాహనాల్లో ఎక్కించారు. ఇండ్లలో ఉన్న వస్తువులు తీసుకునేందుకు సమయం ఇవ్వాలని, దయ చూపించాలని వేడుకున్నా వినిపించుకోలేదని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు కట్టుబట్టలతోనే రోడ్డుపాలయ్యారు. జేసీబీలు తీసుకొచ్చి ఇండ్లను కూల్చివేయడం అన్యాయమని, కష్టపడి సంపాదించుకున్న వస్తువులను ధ్వంసం చేశారని వాపోయారు. తన భర్త పక్షవాతంతో వున్నారని తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఓ మహిళ రోదిస్తూ వాపోయారు.

పేదలకు ఒకన్యాయం..పెద్దలకు ఒక న్యాయమా
అభివృద్ధి పనుల సందర్భంగా పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్నేరు వరదలను, అభివృద్ధిని సాకుగా చూపి ఇండ్లను కూల్చివేస్తున్న అధికారులు.. నగరంలోని పెద్దలు, బడాబాబులు ఆక్రమించిన వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తున్నారు. లకారం వంటి చెరువులను ఆక్రమించిన వారిపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నించిన సీపీఐ(ఎం)పై నిర్బంధాలు
ఇండ్ల కూల్చివేత విషయమై గతంలోనే సీపీఐ(ఎం) నాయకులు బాధితులకు అండగా పలు పోరాటాలు చేశారు. దీని ఫలితంగా.. ప్రజాభీష్టం మేరకే కూల్చివేతలు ఉంటాయని జిల్లా మంత్రి, కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య పేదల ఇండ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ముందుగా బుధవారం ఉదయం 5 గంటలకే సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీటౌన్‌ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావును పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. తర్వాత ఇండ్ల కూల్చివేత ప్రారంభించారు. సీపీఐ(ఎం) త్రీటౌన్‌ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు యర్రా రంజిత్‌.. కూల్చివేతపై ప్రశ్నించడంతో పోలీసులు ఆయనను కూడా అరెస్టు చేసి త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అక్రమ అరెస్టులను ఖండించండి
ప్రకాష్‌నగర్‌లోని రావిచెట్టు బజార్‌ ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేత సందర్భంగా నాయకులను గృహ నిర్బంధం, పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) జిల్లా, ఖమ్మం డివిజన్‌ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, వై.విక్రం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. పేద ప్రజలకు అండగా నిలిచిన తమ పార్టీ నాయకులు, తమను నిరాశ్రయులయులను చేయొద్దన్న పేద ప్రజలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కూల్చబోమని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్లాన్‌ ప్రకారం కూల్చివేశారని, ఇది పాలకుల నియంతృత్వ ధోరణిని తెలియజేస్తోందన్నారు. ఈ అక్రమ అరెస్టులను ప్రజాతంత్ర వాదులందరు ఖండించాలని కోరారు. బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్‌ చేశారు.
-సీపీఐ(ఎం) జిల్లా, ఖమ్మం డివిజన్‌ కార్యదర్శులు నున్నా నాగేశ్వర రావు, వై.విక్రం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -