Thursday, January 29, 2026
E-PAPER
Homeజాతీయంయూజీసీ కొత్త నిబంధనల్లో లోపాలను తక్షణమే సరిదిద్దాలి

యూజీసీ కొత్త నిబంధనల్లో లోపాలను తక్షణమే సరిదిద్దాలి

- Advertisement -

సీపీఐ(ఎం) డిమాండ్‌

న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో తీసుకువచ్చామని కేంద్రం చెబుతున్న యూజీసీ నిబంధనలు-2026ల్లో తీవ్రంగా వున్న లోపాలను తక్షణమే సరిదిద్దాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)ను సీపీఐ(ఎం) కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. వివక్షను పరిష్కరించేందుకు ”సమానత్వ కమిటీ”ని ఏర్పాటు చేయాలని యూజీసీకి అనుబంధంగా వున్న ఉన్నత విద్యా సంస్థలన్నింటినీ ఈ నిబంధనలు ఆదేశిస్తున్నాయి. అటువంటి కమిటీని ఏర్పాటు చేయడమనేది సానుకూల చర్యే, కానీ దీని అమలును మాత్రం నిశితంగా దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అవసరం వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ నిబంధనలను రాజ్యాంగంలోని 14వ అధికరణ నుండి రూపొందించారు. 2012 నాటి నిబంధనల మాదిరిగానే సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తాజా నిబంధనలను తీసుకువచ్చారు.

అందువల్ల వీటిని సంపూర్ణంగా అమలు చేయాల్సి వుందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే, ఈ నిబంధనలను కేవలం యూనివర్సిటీలకు, వాటి అనుబంధ కాలేజీలకు మాత్రమే పరిమితం చేశారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌ వంటి కేంద్ర సంస్థల్లో మాత్రం అమలు కావు. తీవ్రమైన ఈ లోపాన్ని ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని, ఈ సంస్థలన్నింటికీ కూడా సమర్ధవంతమైన ఈక్విటీ యంత్రాంగాలను ఏర్పాటు చేయడం తప్పనిసరని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అలాగే వివక్షను సమగ్రమైన రీతిలో నిర్వచించడంలో కూడా రెగ్యులేషన్స్‌ విఫలమయ్యాయి. వివక్ష అనే భావనను తొలగించడంపైనే వారు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. తద్వారా ఉన్నత విద్యా సంస్థల్లోని వాస్తవికతలను మరుగున పెడుతున్నారు. విద్యార్ధులు, ఫ్యాకల్టీలు ఎదుర్కొంటున్న అన్ని రూపాల్లోని వివక్షల గురించి తెలుసుకుని, నిర్వచించి, గుర్తించి, నిర్మూలించేందుకు యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి.

ఈక్విటీ కమిటీ ఏర్పాటును విద్యా సంస్థ అధిపతి ఇష్టాయిష్టాలకు వదిలి పెట్టరాదు. అందుకు బదులుగా కమిటీకి విశ్వసనీయత, జవాబుదారీతనం వుండేలా చూసేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విద్యార్ధి, ఫ్యాకల్టీ, బోధనయేతర సిబ్బంది ప్రతినిధులతో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి.ఈక్విటీ కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే అప్పీళ్ళను విచారించేందుకు ఒక ఆంబుడ్స్‌మన్‌ను నియమించాల్సిన అధికారాన్ని మాత్రం యూజీసీ తనకు తానుగానే తీసుకుంది. రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాల కింద అనేక యూనివర్శిటీలు ఏర్పడినందున, అలాగే రాజ్యాంగంలోని ఫెడరల్‌ సూత్రాలకు దృష్టిలో వుంచుకుని ఆంబుడ్స్‌మన్‌ను నియమించే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయాలి. అకడమిక్‌ సిలబస్‌లో తిరోగమన, అశాస్త్రీయమైన అంశాలను ప్రవేశపెట్టడం ద్వారా బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం విద్యా రంగానికి మతం రంగును ఎక్కువగా పులుముతోంది.

కుల వివక్షను చట్టబద్ధం చేసే, వర్ణ ప్రాతిపదిక, అణచివేత, దోపిడీ సామాజిక వ్యవస్థల గురించి గొప్పగా చెప్పే మనుస్మృతి వంటి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టడం వల్ల కులం, లింగ ఆధారిత పక్షపాతాలు మరింత ఎక్కువవుతాయి. ప్రభుత్వం తక్షణమే ఇటువంటి అభ్యంతరకరమైన పాఠ్యాంశాలను సిలబస్‌ నుంచి తొలగించాలి. విద్యా సంస్థల్లో కుల విభజనలను మరింత రెచ్చగొట్టేందుకు ఈ నిబంధనలను ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు మరింత విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాయి. అటువంటి ప్రయత్నాలను ఆపేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. సమిష్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే కుల వివక్షపై సమర్ధవంతంగా పోరాడగలమని అందువల్ల అందరూ ఐక్యంగా వుండాల్సిందిగా విద్యార్ధులకు, విద్యా సంస్థలతో ముడిపడిన అందరికీ సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -