Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్య కాషాయీకరణ కోసమే 'ఎన్‌ఈపీ'

విద్య కాషాయీకరణ కోసమే ‘ఎన్‌ఈపీ’

- Advertisement -

– కేరళ సర్కారు బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు విద్యార్థుల కోసం డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు
– విదేశాల్లో ఉన్నత చదువుల కోసమే నాలుగేండ్ల డిగ్రీ
– స్మార్ట్‌ ఏసీ భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
– కేంద్రం నిధులు భిక్ష కాదు… రాష్ట్రాల హక్కు : నవతెలంగాణతో కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు రాధాకృష్ణన్‌

విద్యా కాషాయీకరణ కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని తెచ్చిందని కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు రాధాకృష్ణన్‌ విమర్శించారు. కేరళలో ఎన్‌ఈపీని అమలుచేసేది లేదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరటం భిక్ష కాదనీ, అది రాష్ట్రాల హక్కు అని అన్నారు. ఐద్వా జాతీయ 14వ మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమె కేరళలో ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో మౌళిక వసతుల అభివృద్ధి, విద్యావిధానం, మహిళా సాధికారిత, తదితర అంశాలపై నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే…

దేశంలోని చాలా రాష్ట్రాలు ఎన్‌ఈపీని అమలు చేస్తున్నాయి. కేరళ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
మా వ్యతిరేకత కేవలం రాజకీయమైంది కాదు. విధానపరమైంది. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. కానీ ఎన్‌ఈపీ దేశాన్ని ఒకే మూసలోకి నెట్టాలని చూస్తోంది. ఇది మన వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా విద్యను కాషాయీకరించే కుట్ర జరుగుతోంది. చరిత్రను వక్రీకరిస్తున్నది. శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తున్నది. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. సామాజిక న్యాయం, లౌకిక విలువలను కాపాడటం కోసమే మేము ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నాం.

విద్యా ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కేరళలో ప్రయివేట్‌ వర్సిటీలకు ఎందుకు అనుమతి ఇస్తున్నారు?
మారుతున్న కాలంతోపాటు మనం మారాలి. దేశమంతా ప్రయివేట్‌ వర్సిటీలు వచ్చాయి. ఒక్క కేరళలోనే లేవు. మా పిల్లలు పోటీ ప్రపంచంలో వెనకబడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాల్లో ఎంతోమంది మలయాళీ మేధావులు, ప్రొఫెసర్లు ఉన్నారు. వారి జ్ఞానాన్ని, పెట్టుబడులను రాష్ట్రం కోసం వాడుకోవాలని చూస్తున్నాం. అయితే, ప్రయివేట్‌ వర్సిటీల విషయంలో మా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తాం. ప్రయివేట్‌ వర్సిటీల దస్త్రం గవర్నర్‌ దగ్గరే ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉంది.

మీరు నాలుగేండ్లు డిగ్రీ కోర్సును ఎందుకు ప్రవేశపెట్టారు?
నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తిస్థాయి ‘కేరళ సొంత మోడల్‌’. మా విద్యార్థులు విదేశాల్లో పీజీ చేయాలంటే 16 ఏండ్ల విద్యాభ్యాసం అవసరం. మన దగ్గర మూడేండ్ల డిగ్రీ వల్ల వాళ్లు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాల కోసం నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాం. ఇది విద్యార్థుల ప్రయోజనం కోసమే తెచ్చాం. ఎన్‌ఈపీలో ఉన్నట్టు ఏడాది చదివి మానేస్తే సర్టిఫికెట్‌ ఇచ్చే ‘ఎగ్జిట్‌’ పద్ధతి మా దగ్గర లేదు.

కేరళ విద్యా వ్యవస్థలో సాధించిన ప్రగతి ఏంటి?
కేరళలో డ్రాపౌట్స్‌ అనేవి దాదాపు లేవు. కేరళలో పుట్టిన ప్రతి బిడ్డ స్కూల్‌కు వెళ్తారు. కేరళకు వలసవచ్చిన వారి పిల్లలకు కూడా ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నాం. అందరికీ విద్యతోపాటు నాణ్యమైన చదువును అందిస్తున్నాం. ప్రయివేటు విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడానికి కేరళలో వీల్లేదు. ‘పొదు విద్యాభ్యాస సంరక్షణ యజ్ఞ’ పథకం ద్వారా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నాం. ‘డిజి కేరళ’ ద్వారా అన్ని ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ బోధన అందుబాటులో ఉంది. స్మార్ట్‌ ఏసీ భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఉన్నత విద్యలో అమ్మాయిల నిష్పత్తి 53 శాతానికిపైగా ఉంది. గత నాలుగేండ్లలోనే విద్యారంగంపై రూ.ఆరు వేల కోట్లు ఖర్చు చేశాం. కేరళను ఒక ‘అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌’గా మార్చడమే మా లక్ష్యం.

మహిళా సాధికారిత గురించి వివరించండి?
కుటుంబ శ్రీ పథకం ద్వారా మహిళా సంఘాల్లోని 47 లక్షల సభ్యులకు రూ.ఆరు వేల కోట్ల రుణాలు అందజేశాం. మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నాం. మహిళా సాధికారత కోసం ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -