పవర్ టెక్నాలజీ హబ్‌గా ఇండియా
గ్రామీణ ఉపాధి కల్పన కోసమే వీబీజీఆర్‌ఏఎంజీ చట్టం
దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
ఇండియా డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
వీబీజీఆర్‌ఏఎంజీ చట్టంపై ప్రతిపక్షం ఆందోళన
కొత్తదేమీ లేదు : సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత జాన్ బ్రిట్టాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో అవినీతి కట్టడికి ప్రభుత్వం పని చేస్తోందని, దీంతో ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకుంటుదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసమే వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభిస్తూ బుధవారం ఆమె పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తోందని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశం సంస్కరణల పథంలో దూసుకెళ్తోందని అన్నారు. పీఎల్ఐ పథకం కింద పారిశ్రామికోత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించామని చెప్పారు. సముద్ర వ్యాపారాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించారు.
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పదేండ్లలో పేదల కోసం నాలుగు కోట్ల ఇండ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ‘పదేండ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోంది. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లతో సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్ల మందికి ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. గతేడాది 2.5 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆక్వా, పాల ఉత్పత్తుల్లో ఇండియా ముందంజలో ఉంది’ అని పేర్కొన్నారు.దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకాశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని తెలిపారు.
11 ఏండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు. జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లోనూ దేశం దూసుకెళ్తోంది. దేశం పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇండియాను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్ భారత్‌లో రైతుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది’ అని అన్నారు.
‘గ్రామీణ ఉపాధి కల్పన కోసం వీబీజీఆర్‌ఏఎంజీ చట్టం తీసుకొచ్చాం.దేశాభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర కల్పించాం. ఆపరేషన్ సిందూర్‌లో సైనికుల సత్తా చాటారు. ఇండియాపై దాడిచేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం చూసింది. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు స్థాయిలో పెరిగింది. ఆపరేషన్ సిందూర్ తరువాత దేశ డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. నానో చిప్‌ల తయారీపైనా ఇండియా దృష్టి సారించింది. మైక్రో చిప్‌ల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించగలిగాం. ముద్ర యోజనతో చిరు వ్యాపారులకు భారీగా రుణాలు ఇచ్చాం. పీఎం విశ్వకర్మ యోజనతో 20 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం’ అని తెలిపారు.
వీబీజీఆర్‌ఏఎంజీ చట్టంపై ప్రతిపక్షం ఆందోళన
వీబీజీఆర్‌ఏఎంజీ చట్టంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని తమ స్థానాల్లో నిల్చోని చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్లతో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గందరగోళం నెలకుంది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని రాష్ట్రపతి చదివారని, అందులో కొత్తదనమేది లేదని అన్నారు. ప్రభుత్వం చెప్పిందే పదేపదే రాష్ట్రపతితో చెప్పించిందని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వీబీజీఆర్‌ఏఎంజీ చట్టం గురించి రాష్ట్రపతి మాట్లాడేటప్పుడు ప్రతిపక్షం తన ఆందోళనను వ్యక్తం చేసిందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగించినప్పుడు ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేయడం దారుణమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు.
రాష్ట్రపతి ప్రసంగంలో వాస్తవం, జవాబుదారీతనం లేదు: మల్లికార్జున్ ఖర్గే
రాష్ట్రపతి ప్రసంగంలో వాస్తవం, జవాబుదారీతనం లేదని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. పేద ప్రజల గురించి ప్రసంగంలో నొక్కి చెప్పారని, కానీ వాస్తవానికి కోట్లాది మంది పేద ప్రజల జీవనోపాధికి ప్రధాన వనరు, పనిహక్కుకు హామీ ఇచ్చే ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని విమర్శించారు.
కొత్తదేమీ లేదు: జాన్ బ్రిట్టాస్
రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదేమీ లేదని, అన్ని పాత ప్రస్తావనలేనని సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. కేంద్ర మంత్రివర్గం తయారు చేసిన ప్రతిని రాష్ట్రపతి చదివి వినిపించారని, అందులో సంఖ్యల్లోనే కొన్ని మార్పులు ఉన్నాయే తప్ప, కొత్తగా ఏమీ లేదని అన్నారు. గతంలో చెప్పినవే రాష్ట్రపతితో పదేపదే చెప్పించారని అన్నారు. దేశంలో రైతులు, కార్మికులు, యువత, మహిళలు, మైనార్టీలు, విద్యార్థుల సమస్యలు, దేశ భద్రత, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం వంటి కీలక సమస్యలను రాష్ట్రపతి విస్మరించారని అన్నారు. దేశంలోని పేదరికం తగ్గించేందుకు కీలక పాత్ర పోషించే, పేదలకు జీవనోపాధిగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారని, దాన్ని గొప్పగా చెప్పుకుంటునే, మరోవైపు పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దు, సర్ కేంద్రాన్ని నిలదీయాలి : ప్రతిపక్షాల పార్టీల సమావేశంలో నిర్ణయం
పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ రద్దు, సర్ అంశాలను లేవనెత్తాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, కేంద్ర బడ్జెట్ పై జరిగిన చర్చల్లో పాల్గొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని నిర్ణయించాయి. బుధవారం పార్లమెంట్ లో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో ఇండియా బ్లాక్ కు చెందిన ప్రతిపక్ష పార్టీల నాయకులు సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, కేంద్ర బడ్జెట్ సమర్పణ, చర్చ సమయంలో కూడా నాయకులు నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ”ఎంజీఎన్ఆర్ఈజీఏ పునరుద్దరణను డిమాండ్ చేయడానికి ప్రతిపక్షం అన్ని ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగిస్తుంది” అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేశ్ అన్నారు. ఈ సమావేశంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రమేష్, కేసీ వేణుగోపాల్, డీఎంకే ఎంపీ టిఆర్ బాలు, శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, ఎస్పీ ఎంపీ జావేద్ అలీ ఖాన్, ఆర్జేడి ఎంపీ ప్రేమ్ చంద్ గుప్తా, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ ఎంపీ పి. సంతోష్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్ కె ప్రేమ్ చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.



